నా కూతుళ్లిద్దరినీ శంకరే చంపేశాడు
సాక్షి, టాస్క్‌ఫోర్స్: ‘‘నాకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు సంతానం. నా ఇద్దరు కూతుళ్లను బొమ్మ శంకర్ చంపేశాడు. నా పెద్దకూతురు గౌతమిని ప్రేమించానంటూ వెంటబడి మోసం చేయగా.. గతంలోనే ఆమె ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం నా రెండో కుమార్తె గీతను అదే ప్రేమపేరుతో లొంగదీసుకొని వివాహం చేసుకుని రోజూ వేధించాడు. ఫిబ్రవరి 26న కొట్టి చంపి ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. నాకు జరిగిన అన్యాయంపై రామగిరి పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు నిందితుడికే వత్తాసు పలుకుతున్నారు’’ అంటూ పేరూరు పంచాయతీ కురుగుండ్లకాలనీకి చెంజిన ఓబుళమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఆమె ఓ వీడియో రూపొందించి సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఫిబ్రవరి 26న రామగిరి మండలంలోని పేరూరు పంచాయతీ కురుగుండ్లకాలనీకి చెందిన హరిజన గీత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, తన కూతురిది ఆత్మహత్య కాదంటూ మృతురాలి తల్లి ఓబుళమ్మ మొదటి నుంచీ ఆరోపిస్తున్నారు. పూర్తిస్థాయి విచారణ జరిపి న్యాయం చేయాలంటూ పోలీసులను కోరుతోంది. కానీ పోలీసులు సరిగా స్పందించకపోవడంతో శనివారం ఆమె కన్నీరుమున్నీరవుతూ తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. తన ఇద్దరు కుమార్తెల మరణాలకు కారకుడైన బొమ్మ శంకర్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రామగిరి పోలీసులు కేసును తారుమారుచేసి పక్కదారి పట్టిస్తున్నారని, త్వరలోనే కుటుంబీకులతో కలిసి ఎస్పీని కలిసి తన గోడు వెళ్లబోసుకుంటానని వెల్లడించింది.
ప్రేమ పేరుతో ఒకరిని, పెళ్లి చేసుకుని
మరొకరిని వేధించి ప్రాణాలు తీశాడు
రామగిరి పోలీసులకు ఫిర్యాదు చేస్తే
నేరస్తుడి వైపే నిలిచారు
తన ఆవేదనను సోషల్ మీడియాలో
వ్యక్తం చేసిన ఓబుళమ్మ


