● జన జాతర
కనగానపల్లి: దాదులూరు జన సంద్రమైంది. పోతలయ్యస్వామి దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం పోతలయ్య, చెన్నేకేశవస్వాముల జ్యోతుల మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని పోతలయ్య, బంగారు లింగమయ్య, చెన్నేకేశవస్వాములను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. భక్తులు జ్యోతులు, బోనాలు ఎత్తుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివార్లకు సమర్పించారు. సాయంత్రం చుట్టు పక్కల గ్రామాల్లోని ప్రజలు, రైతులు ఎద్దులు, ట్రాక్టర్లతో పన్నేరు బండ్లు కట్టి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నలుమూలల నుంచే కాకుండా కర్ణాటకలోని బెంగళూరు, బళ్లారి, పావగడ తదితర ప్రాంతాల నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. జాతర సందర్భంగా ఆలయ గోపురాలు, ప్రాకారాలను రంగు రంగుల విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ ఆవరణలో వందలాది మిఠాయి, గాజులు, బొమ్మల దుకాణాలు వెలిశాయి.
పోతలయ్యస్వామి పరుషలో ప్రధాన ఘట్టమైన గావుల మహోత్సవాన్ని ఆదివారం తెల్లవారుజామున నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఫాల్గుణ శుద్ధ పంచమి గడియల్లో జరిగే ఈ కార్యక్రమంలో తొమ్మిది మంది పోతురాజులు మేకపోతు పిల్లల మెడలను నోటితో కొరికి స్వామివారికి బలి ఇస్తారు. ఈ మహత్తర ఘట్టాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులు తెల్లవార్లూ ఆలయం వద్దే వేచి ఉంటారు. కార్యక్రమం అనంతరం భక్తులు వందలాది పొట్టేళ్ల్లు, మేకపోతులను స్వామికి సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ధర్మవరం డీఎస్పీ హేమంత్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
వైభవంగా పోతలయ్య, చెన్నకేశవుల జ్యోతుల మహోత్సవం
భక్త జనసంద్రమైన దాదులూరు..
నేడు గావుల మహోత్సవం


