పీపీపీ విధానాన్ని ఆర్టీసీ పీకకు చుట్టొద్దు
● ధర్నాలో ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు
అనంతపురం క్రైం: పీపీపీ విధానాన్ని ఆర్టీసీ పీకకు చుట్టరాదంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. పీపీపీ విధానంలో విద్యుత్ బస్సులను ఆర్టీసీలో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ శుక్రవారం అనంతపురం డిపో ఎదుట యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.నార్జునరెడ్డి, రాష్ట్ర మెయింటెనెన్స్, కమిటీ సభ్యుడు సి.నబీరసూల్, జోనల్ అధ్యక్షుడు పి.ఎస్.ఖాన్, జోనల్ ప్రచార కార్యదర్శి డి.ఓ. రత్నం, నాయకులు ఎ.ఎల్. కుమార్, కె. కొండయ్య, జిల్లా అధ్యక్షుడు ఆర్.విజయ భాస్కర్ రెడ్డి తదితరులు మాట్లాడారు. విద్యుత్ బస్సుల పేరుతో డిపోలను ఖాళీ చేయించే విధానం సరికాదన్నారు. పర్యావరణ పరిరక్షణ పేరుతో ప్రైవేట్ ఆపరేటర్లకు ఆర్టీసీని కట్టబెట్టేందుకు ప్రభుత్వం సిద్ధపడడం సిగ్గు చేటన్నారు. ఈ విధానాన్ని తక్షణమే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా రవాణా వ్యవస్థ ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగాలన్నారు. ఆర్టీసీకి చెందిన విలువైన ఆస్తులను ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించే ఆలోచనను విరమించుకోవాలని హితవు పలికారు. ఆర్టీసీలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.


