నేటి నుంచి ‘బాలోత్సవం’
అనంతపురం కల్చరల్: రెండు రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా సాగే బాలోత్సవానికి అనంతపురం సిద్ధమైంది. శనివారం నగరంలోని ఎస్‌ఎస్‌బీఎన్ పాఠశాల ప్రాంగణంలో ఈ వేడుకలను ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో ఏర్పాట్లను శుక్రవారం బాలోత్సవం కమిటీ కమిటీ చైర్‌పర్సన్ షమీమ్ షఫీవుల్లా, ఐద్వా సావిత్రి, కార్యదర్శి శ్రీనివాసరావు పరిశీలించారు. శని, ఆదివారాల్లో సాగే ఈ వేడుకలకు 150కి పైగా పాఠశాలలకు చెందిన 6 వేల మందికి పైగా విద్యార్థులు పాల్గొనే అవకాశముందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ అకడమిక్ (విద్యా సంబంధమైనవి), కల్చరల్ (కళలకు సంబందించినవి)తో పాటు వివిధ క్రీడా పోటీలు ఉంటాయన్నారు. అక్కడికక్కడే విజేతలను ప్రకటించి కవులు, మేధావుల చేతుల మీదుగా బహుమతులను అందజేస్తామన్నారు. పోటీల్లో పాల్గొనేందుకు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని, టిఫెన్, భోజనం ఉచితంగానే అందజేస్తామని పేర్కొన్నారు.


