విపరీతంగా పూత పట్టిన మామిడి చెట్టు
మామిడి విపరీతంగా పూత వచ్చినా ఆలస్యం కావడంతో దిగుబడులపై ప్రభావం
మొదట్లో తేనెమంచు, గొంగళిపురుగు, చివర్లో పండుఈగ ఆశించే అవకాశం
వాతావరణ మార్పులు కారణంగా మామిడి ఫలసాయంపై అన్నదాత ఆందోళన
ఫలరాజు మామిడి ఈసారి ‘అనంత’ అన్నదాతల్లో గుబులు రేకెత్తిస్తోంది. ఎక్కడ చూసినా తోటల్లో విపరీతమైన పూత రావడం, రాలిపోవడం, మళ్లీ వస్తుండడంతో ఫలసాయం ఏ మేరకు వస్తుందనే బెంగ పట్టుకుంది. రైతుల్లోనే కాదు ఉద్యానశాఖ అధికారులు, ఉద్యాన శాస్త్రవేత్తలకు కూడా అంతుబట్టని పరిస్థితి నెలకొంది. మామిడి తోటల స్థితిగతులు, దిగుబడులు, మార్కెటింగ్ అంశాల గురించి ఉద్యానశాఖ అధికారులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. వాతావరణ మార్పుల కారణంగా ఈ సారి మామిడి తోటల పంటకాలం గతి తప్పే ప్రమాదం పొంచి ఉన్నట్లు ఆందోళన వ్యక్తమవుతోంది.
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో చీనీ తర్వాత మామిడి ఎక్కువగా సాగు చేశారు. ఈ–క్రాప్ నివేదిక ప్రకారం ఈసారి 35 వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించాయి. 80 శాతం బేనిషా, మిగతా 20 శాతం తోతాపురి, ఖాదర్, బెంగళూరు, మల్లిక, ఇతర్రతా రసాలు సాగులో ఉన్నాయి. పంట పరిస్థితి ఆశాజనకంగా కనిపిస్తున్నా దిగుబడులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా చిన్నా పెద్దా, పాత తోటలు, అటవీప్రాంతంలో ఉన్న మామిడి చెట్లన్నీ విపరీతంగా పూత పట్టినట్లు చెబుతున్నారు. అయితే డిసెంబర్, జనవరి 15 లోపు పూర్తిగా పూత పట్టాల్సిన మామిడి ఈసారి ఫిబ్రవరిలో రావడం వల్ల చాలా ఆలస్యం కావడంతో దిగుబడులపై ఆందోళన కనిపిస్తోందని అంటున్నారు. దాదాపు 70 శాతం తోటలు ఈపాటికి పిందె, కాయ దశలో ఉండాల్సి ఉండగా అందుకు భిన్నంగా 30 శాతం తోటలు మాత్రమే పిందె దశకు చేరుకున్నట్లు చెబుతున్నారు.
ఈసారి చలికాలం మరీ ఎక్కువ రోజులు కొనసాగడం, ఇప్పుడు కూడా ఉదయం పూట కనిష్ట ఉష్ణోగ్రతలతో శీతల వాతావరణం ఉన్నందున పూత అధికంగా వస్తున్నట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్న సమయంలో ఎండలు కనిపిస్తుండటంతో పూత రాలడం, మళ్లీ పూత పడుతూ ఉండటంపై దిగుబడుల పరిస్థితి ఏంటో అంతుచిక్కడం లేదంటున్నారు.
చీడపీడలు ఆశించే అవకాశం
విచిత్ర వాతావరణం నడుమ మామిడి తోటల్లో పూత చాలా ఆలస్యంగా రావడం వల్ల మొదట్లో తేనెమంచు పురుగు, గొంగళి పురుగు ఆశించి దెబ్బతీసే పరిస్థితి కనిపించింది. అయితే పూత నుంచి పిందె, కాయ, పండు కావడం చాలా ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున చివర్లో పండుఈగ నష్టం కలగజేసే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు. ఏప్రిల్‌లో మార్కెట్‌లోకి రావాల్సిన మామిడి ఈసారి ఆలస్యం అయ్యే అవకాశం ఉండగా.. జూలైలో గాలులు మొదలయ్యే నాటికి పండుఈగ దాడి చేసి నష్టం కలిగించ వచ్చంటున్నారు. జూన్, జూలై వర్షాలు మొదలు మార్కెట్ కూడా పడిపోవచ్చని చెబుతున్నారు.
ఇప్పుడు పూత రావడం వల్ల ఏప్రిల్, మేలో ఈదురుగాలులు, అకాల వర్షాలకు పిందెలు రాలిపోయే పరిస్థితి కూడా ఉండవచ్చని చెబుతున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యం కావడం, అలాగే కేవలం 15 రోజులు ఉండాల్సిన పూత దశ ఇప్పుడు 20 రోజులకు పైగా పెరగడం వల్ల మామిడి పరిస్థితిపై అర్థం కావడం లేదని అధికారులు చెబుతున్నారు. అనంతపురం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా మామిడి తోటల పరిస్థితి ఇలాగే ఉందని చెబుతున్నారు.
చివర్లో పంటనష్టపరిచే పండుఈగ
మామిడిని మొదట్లోనే దెబ్బతీసే కొత్త రకం గొంగళి పురుగులు


