తక్కువ ధరకే ఫార్చునర్‌ కారు అంటూ టోకరా | - | Sakshi
Sakshi News home page

తక్కువ ధరకే ఫార్చునర్‌ కారు అంటూ టోకరా

Feb 19 2026 9:46 AM | Updated on Feb 19 2026 9:46 AM

తక్కు

తక్కువ ధరకే ఫార్చునర్‌ కారు అంటూ టోకరా

అప్రమత్తంగా ఉండాలి

కళ్యాణదుర్గం: తక్కువ ధరకే ఫార్చునర్‌ కారు వస్తుందంటూ సైబర్‌నేరగాళ్లు ఆన్‌లైన్‌ ద్వారా ఓ అమాయకుడికి ఆశ చూపి రూ.24 లక్షలకు టోకరా వేశారు. ఈ ఘటన కళ్యాణదుర్గం మండలంలో వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం వట్లూరు గ్రామానికి చెందిన భీముడు అజిత్‌కుమార్‌ ‘ఓఎల్‌ఎక్స్‌’లో ఓ ఫార్చునర్‌ కారు రూ.24 లక్షలకే వస్తుందంటూ పోస్టు పెట్టాడు. ఈ పోస్టు చూసిన వైఎస్సార్‌ కడప జిల్లా పోరుమామిళ్లకు చెందిన వేణుగోపాల్‌రెడ్డి కారు కోసం అజిత్‌ కుమార్‌తో బేరం కుదుర్చుకున్నాడు. ఈ వ్యవహారంలో అజిత్‌ కుమార్‌ హైదరాబాద్‌లో క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ఉప్పొంక గ్రామానికి చెందిన తూర్పు త్రిశాంత్‌ను రంగంలోకి దింపాడు. ఈ క్రమంలో వేణుగోపాల్‌రెడ్డి ద్వారా రూ.24 లక్షలను తూర్పు త్రిశాంత్‌ పేరిట కళ్యాణదుర్గంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఖాతాకు జమ చేయించాడు. అనంతరం ఓఎల్‌ఎక్స్‌లో ఫార్చునర్‌ కారు పెట్టినందుకు ఒరిజనల్‌ ఓనర్‌ అకౌంట్‌కు రూ.10 వేలు ఫోన్‌ పే ద్వారా చెల్లించి.. మిగిలిన డబ్బుతో ఉడాయించేశాడు. కారు కోసం వేణుగోపాల్‌రెడ్డి.. అజిత్‌కుమార్‌కు ఫోన్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. తనను మోసం చేశారని గ్రహించాడు. బాధితుడు ఆ జిల్లాలో ఫిర్యాదు చేశాడు. దీని ఆధారంగా కేసు విచారణ జరుగుతోంది. వచ్చిన సొమ్ముతో అజిత్‌, త్రిషాంత్‌ కర్ణాటకకు వెళ్లి ఓ జ్యువెలరీ షాపులో బంగారం కొన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ క్రమంలో నేరగాళ్ల కోసం విజయవాడ సైబర్‌ క్రైం పోలీసులు రెండు రోజుల క్రితం కళ్యాణదుర్గం వచ్చి విచారణ జరిపినట్లు సమాచారం.

పక్కా ప్లాన్‌తో మోసాలు

భీముడు అజిత్‌ కుమార్‌ అమాయకులను లక్ష్యంగా చేసుకుని పక్కా ప్రణాళికతో మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇతనికి ఏకంగా పలు రకాల చిరునామాలతో ఐదు ఆధార్‌ కార్డులు ఉన్నట్లు తేల్చారు. ఇలాంటి కేసుల్లో న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొనేందుకు తన సోదరితో పాటు ఐదుగురు అడ్వకేట్లను నియమించుకున్నట్లు తెలుస్తోంది. ఏ సమస్య వచ్చినా అజిత్‌కుమార్‌ను అరెస్టు చేయకుండా అడ్వకేట్లే కాపాడుతుంటారని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ క్రమంలోనే సైబర్‌ మోసంపై ఓ సీఐ.. అజిత్‌కుమార్‌కు ఫోన్‌ చేయగా..‘గాలిని పట్టుకోగలవా?! నీకు దమ్ముందా’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడిన ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

టోకరా వేసిన అజిత్‌ కుమార్‌, త్రిషాంత్‌ (ఫైల్‌)

ఇటీవల కాలంలో ప్రజలు అత్యాశకు పోయి సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నారు. అధిక ఆదాయం పొందవచ్చని మోసపోతున్నారు. ఏటీఎంల వద్ద అమాయకుల కార్డులను మార్చి డబ్బు కాజేస్తున్నారు. అలాగే ఓఎల్‌ఎక్స్‌లో మంచి కార్లు ఉన్నాయంటూ ఆశజూపి రూ.లక్షలు కొల్లగొట్టేస్తున్నారు. ఇలాంటి వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

– రవిబాబు, డీఎస్పీ, కళ్యాణదుర్గం

తక్కువ ధరకే ఫార్చునర్‌ కారు అంటూ టోకరా 1
1/2

తక్కువ ధరకే ఫార్చునర్‌ కారు అంటూ టోకరా

తక్కువ ధరకే ఫార్చునర్‌ కారు అంటూ టోకరా 2
2/2

తక్కువ ధరకే ఫార్చునర్‌ కారు అంటూ టోకరా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement