రంజాన్ మాసంలో అంతా మంచి జరగాలి
అనంతపురం: పవిత్ర రంజాన్ మాసం బుధవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముస్లింలకు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట రామిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో అంతా మంచి జరగాలని ఆకాంక్షించారు. మనిషిలోని చెడు భావనలు, అధర్మం, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని పేర్కొన్నారు.
జేఈఈ మెయిన్స్‌లో
గుంతకల్లు విద్యార్ధి ప్రతిభ
గుంతకల్లు: జేఈఈ మెయిన్స్‌లో గుంతకల్లుకు చెందిన ఐ.అభిషేక్ కాంత్ ప్రతిభ చాటాడు. సోమవారం విడుదల చేసిన ఫలితాల్లో 99.99 పర్సంటైల్ సాధించాడు. స్థానిక రైల్వే స్టేషన్‌లో సీనియర్ సెక్షన్ ఆఫీసర్ రవికాంత్, ఫిజికల్ సైన్స్ టీచర్ సరిత దంపతుల కుమారుడైన అభిషేక్ విజయవాడలోని చైతన్య ఐఐటీ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు.
బడి వేళకు బస్సు నడపరా?
కణేకల్లు: బడి వేళకు బస్సులు రావడం లేదు. రోజూ ఆలస్యంగానే వెళ్లాల్సి వస్తోంది. పాఠాలు కోల్పోతున్నారు. చదువులో వెనుకబడిపోతున్నారు. సహనం నశించిన విద్యార్థులు ఆర్టీసీ అధికారులపై నిరసనాగ్రహం వ్యక్తం చేశారు. నాగేపల్లిలో ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉంది. దాదాపు 80 మంది విద్యార్థులు మాల్యం గ్రామంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 8, 9, 10వ తరగతులు చదువుతున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు తరగతులు ప్రారంభమవుతాయి. పాఠశాల సమయానికి బస్సు నడుపుతామని చెప్పిన ఆర్టీసీ అధికారులు ఆలస్యంగా పంపుతున్నారు. గ్రామానికి 9 గంటలపైన బస్సు వస్తోంది. దీంతో కొంతమంది విద్యార్థులు కాలినడకన పాఠశాలకు వెళ్తున్నారు. తమ చదువులకు ఆటంకం కలుగుతోందని ఆర్టీసీ డిపో అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. పరీక్షలు దగ్గరపడుతున్నా ఎటువంటి చర్యలూ చేపట్టకపోవడంతో విద్యార్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బుధవారం ఆలస్యంగా నాగేపల్లికి బస్సు రావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అడ్డుకున్నారు. రోడ్డుపై ముళ్లకంపలు వేసి గంటపాటు రాస్తారోకో చేశారు. విద్యార్థులంటే లెక్కలేదా..? మా జీవితాలతోనే ఆటలాడతారా? అంటూ మండిపడ్డారు. ఆందోళన గురించి డ్రైవర్, కండక్టర్ రాయదుర్గం డిపో మేనేజర్‌కు ఫోన్ ద్వారా తెలియజేశారు. ఇక మీదట పాఠశాల వేళకు తప్పకుండా బస్సు నడుపుతామని డీఎం హామీ ఇవ్వడంతో విద్యార్థులు శాంతించి రాస్తారోకో విరమించారు.
రంజాన్ మాసంలో అంతా మంచి జరగాలి


