శివ మహోత్సవం
శివ మహోత్సవం పేరుతో టీడీపీ నేత లక్ష్మీప్రసాద్ బలప్రదర్శన
‘అనంత’ మేయర్, ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ప్రయత్నాలు
లక్ష్మీప్రసాద్ వెనుక గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్ర
కార్యక్రమానికి లక్ష్మీప్రసాద్ సతీమణి శైలజ పూర్తి సహకారం
డీఆర్‌డీఏ పీడీ, ఎస్‌ఎస్‌ఏ ఏపీసీగా ఉన్న శైలజ
ఓ జిల్లా అధికారి కూడా కార్యక్రమానికి తనవంతు సాయం
అంతర్గతంగా చందాల వసూళ్లు.. అధికారుల అండతో జన సమీకరణ
తమిళనాడులోని అరుణాచలం నుంచి ఉత్సవ మూర్తులను తీసుకొచ్చి అనంతపురంలో శివమహోత్సవం నిర్వహించారు. 30 వేల మంది భక్తులు హాజరైనట్లు ప్రచారం జరిగింది. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు కుమారుడి చేత ప్రవచనం చేయించారు.
సాక్షి ప్రతినిధి అనంతపురం: తెలుగుదేశం పార్టీ నేత, ఏపీఐఐసీ డైరెక్టర్ చల్లా లక్ష్మీప్రసాద్ చేసిన శివమహోత్సవం, దాని వెనుక ఉన్న అసలు సంగతి, భర్త కోసం భార్య డీఆర్‌డీఏ పీడీ, ఎస్‌ఎస్‌ఏ ఏపీసీ శైలజ అధికారాన్ని దుర్వినియోగం చేసిన తీరు ఇప్పుడు అనంతపురంలో హాట్ టాపిక్‌గా మారింది. లక్ష్మీప్రసాద్ అలియాస్ ఆయిల్‌బాబు శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం నిడిగల్లు వాసి. ఈయన పామోలిన్ వ్యాపారం చేసేవారు. ఆపై రియల్ ఎస్టేట్ వ్యాపారమూ చేస్తున్నారు. ఇస్కాన్ దగ్గర భూ వివాదంలో కూడా గతంలో జోక్యం చేసుకున్నారు. అయితే ఇస్కాన్ వారితో వివాదం జరుగుతుండగానే లక్ష్మీప్రసాద్ ట్యాంకర్ కాలిపోయింది. దీంతో దేవుడి వ్యవహారంలో జోక్యం చేసుకోకూడదని ఇస్కాన్ వారితో రాజీ పడ్డారు. ఆ భూమిని ఇస్కాన్ వారికే విక్రయించారు. ఇతను కుప్పం టీడీపీ ఎమ్మెల్సీ శ్రీకాంత్‌కు అత్యంత సన్నిహితుడు. ఇతని ద్వారా చంద్రబాబు కుప్పంకు వచ్చిన ప్రతీసారి కలిసేవారు. ఇలా ఏపీఐఐసీ డైరెక్టర్ పోస్టు తెచ్చుకున్నారు. దీనికి అనంత, శ్రీసత్యసాయి జిల్లాలకు చెందిన పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు సిఫార్సు లేఖలు కూడా ఇచ్చారు.
టికెట్ కోసం ప్రయత్నం!
అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఏడాదిన్నర వ్యవధిలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత తెచ్చుకున్నారు. ఈ క్రమంలో త్వరలో జరగనున్న నగరపాలక సంస్థ ఎన్నికల బాధ్యత నుంచి దగ్గుపాటిని తప్పించి జిల్లాలోని ఓ ఎమ్మెల్యేను ఇన్‌చార్జ్‌గా పెట్టి ముందుకు వెళ్లాలని టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మేయర్‌గా లేదా 2029 ఎన్నికల్లో అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ దక్కించుకునేందుకు లక్ష్మీప్రసాద్ తెర వెనుక ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇందుకు టీడీపీ జిల్లా ఇన్‌చార్జ్‌గా ఉన్న గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్ర (నాని) కూడా లక్ష్మీప్రసాద్‌కు సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. ‘పుర’ పోరులోపు నగర ప్రజలకు చేరువయ్యేందుకు లక్ష్మీప్రసాద్ మహాశివరాత్రి రోజున ‘శివ మహోత్సవం’ నిర్వహించారు.
నాకు తెలియదు.. నన్నడగొద్దు
శివరాత్రి రోజున అనంతపురంలో నిర్వహించిన శివ మహోత్సవంలో అధికార దుర్వినియోగంపై లక్ష్మీప్రసాద్ సతీమణి, డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శైలజను ‘సాక్షి’ ఫోన్‌లో వివరణ కోరగా...‘ఆ కార్యక్రమం గురించి నాకేమీ తెలియదు. నన్ను అడగొద్దు’ అంటూ ఫోన్ కట్ చేశారు. అయితే శివ మహోత్సవం భూమి పూజ దగ్గర నుంచి వీవీఐపీల ఆహ్వానం, కార్యక్రమ నిర్వహణ, ముగింపు వరకు దంపతులిద్దరూ హడావుడి చేశారు. అయినా ఆమె అందుకు విరుద్ధంగా వివరణ ఇవ్వడం గమనార్హం.


