పచ్చ దండులో ‘ఈ–స్టాంప్’ గుబులు
కళ్యాణదుర్గం: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ–స్టాంప్‌ల కుంభకోణం ‘పచ్చ’ నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఈ–స్టా్‌ంప్ పేరుతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొట్టిన నేతలు స్థానికంగా వ్యవస్థలను మేనేజ్ చేసి ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు యత్నించారు. దీంతో వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య ఈ–స్టాంప్ కుంభకోణంపై పిల్ వేయగా.. హైకోర్టు విచారణకు స్వీకరించింది. అంతేకాకుండా ఈ వ్యవహారంలో ప్రభుత్వ కార్యదర్శితోపాటు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, మరో 11 మందికి గత ఏడాది డిసెంబర్ 14న హైకోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు బుధవారం హైకోర్టు ఎదుటకు రానుంది.
స్టాంపు డ్యూటీ ఎగ్గొట్టిన ఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్
టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకలోనూ కాంట్రాక్టు కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కంపెనీ గత ఏడాది యూనియన్ బ్యాంక్ నుంచి రూ.900 కోట్ల మేర రుణం తీసుకుంది. ఆస్తులు తనఖా పెట్టి ఆ గ్యారెంటీతో రుణాలు తీసుకోవాలి. దీనికోసం ముందుగా స్టాంప్ డ్యూటీ చెల్లించి తనఖా వివరాలు పొందుపరిచి ఈ–స్టాంప్ పొందాలి. రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ చార్జీలు చెల్లించాలి. బ్యాంకు రుణంలో 0.5 శాతం స్టాంప్ డ్యూటీ కింద కంపెనీ చెల్లించాల్సి ఉంది. అంటే రూ.900 కోట్ల రుణానికి రూ.4.5 కోట్ల స్టాంప్ డ్యూటీ ప్రభుత్వానికి చెల్లించాలి. అయితే ఎస్‌ఆర్‌సీ కంపెనీ మాత్రం నాలుగు డాక్యుమెంట్ల ద్వారా మొత్తం రూ.1,51,700 మాత్రమే చెల్లించింది. అంటే రూ.4,48,48,300 మేర స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు చెల్లించకుండా మోసగించింది. ఈ వ్యవహారమంతా కళ్యాణదుర్గంలోని మీ–సేవ నిర్వాహకుడు బాబు (యర్రప్ప) ద్వారా చేయించారు. ప్రభుత్వానికి ఈ–స్టాంప్ రూపంలో 0.5 శాతం మొత్తాన్ని చెల్లించాల్సి ఉండగా.. రూ.కోట్లలో ఉన్న రుణ మొత్తాన్ని బాగా తగ్గించి చూపారు. ఇలా జనరేట్ అయిన డాక్యుమెంట్‌లో స్టాంప్ డ్యూటీ మొత్తాన్ని ఫ్యాబ్రికేట్ చేసి నిబంధనల ప్రకారం ఎంత చెల్లించాలో ఆ మొత్తాన్ని పొందుపరచి మరో ప్రింట్ తీసి కంపెనీ ప్రతినిధులకు అందించారు. దీన్ని యూనియన్ బ్యాంక్‌కు సమర్పించి రూ.900 కోట్ల రుణం తీసుకుని మోసగించారు.
అంతర్మథనంలో ఎమ్మెల్యే అమిలినేని
ఈ–స్టాంప్ కుంభకోణంలో ప్రతివాదిగా ఉన్న కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఈ వ్యవహారం నుంచి ఎలా బయటపడాలన్న అంశంపై హైకోర్టు సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. స్థానిక పోలీసులతో కాకుండా కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణకు ఆదేశిస్తే ఎలా ఎదుర్కోవాలన్న దానిపై తీవ్రస్థాయిలో చర్చించినట్లు సమాచారం. అయితే బుధవారం ఈ–స్టాంప్‌ల కుంభకోణంపై హైకోర్టు వివరణ ఇవ్వాలని ఆదేశించడంతో కేసులో ప్రతివాదులు నేరుగా కోర్టుకు హాజరవుతారా లేదా అన్న సంశయం అందరిలోనూ నెలకొంది.
కుంభకోణంపై నేడు హైకోర్టులో విచారణ
ఈ కేసులో ఇప్పటికే 13 మందికి హైకోర్టు నోటీసులు
ప్రతివాదులు హాజరవుతారా..?
అంతర్మథనంలో కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని


