హితాన్ని బోధించే రంజాన్‌ | - | Sakshi
Sakshi News home page

హితాన్ని బోధించే రంజాన్‌

Feb 18 2026 7:13 AM | Updated on Feb 18 2026 7:13 AM

హితాన్ని బోధించే రంజాన్‌

హితాన్ని బోధించే రంజాన్‌

ఉపవాసాలు, ప్రార్థనలు, దానధర్మాలతో నెలరోజుల పాటు నియమనిష్టలతో గడిపే పవిత్ర రంజాన్‌ మాసం రానే వస్తోంది. దాదాపు 31 సంవత్సరాల తర్వాత ఫిబ్రవరిలోనే ఈ మాసం ప్రారంభం కావడం విశేషం. మానవాళి మనుగడకు, దిశా నిర్దేశం చేసిన ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్‌ భూమిపై ఆవిర్భావించిన రోజులనే రంజాన్‌ మాసంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 19 నుంచి రంజాన్‌ మాసం ప్రారంభం కానున్న సందర్భంగా ఉపవాస దీక్షలకు ముస్లింలు సిద్ధమవుతున్నారు.

ఆత్మకూరు: ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్‌ మాసం ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుంది. సాధారణంగా ముస్లిం సంవత్సరాది మొహరంతో ప్రారంభమవుతుంది. ఇలా ప్రారంభమైన సంవత్సరంలో 9వ నెల రంజాన్‌ గా పిలువబడుతుంది. ఈ నెలలోనూ పవిత్ర దివ్య ఖురాన్‌ ను భూమి పైకి అల్లాహ్‌ పంపించినట్లుగా ముస్లింల అపార నమ్మకం. దివ్య ఖురాన్‌ లోని 30 అధ్యాయాలను రోజుకో అధ్యాయం చొప్పున అల్లాహ్‌ ఈ భూమి మీదకి పంపించడంతో రంజాన్‌ నెలలోనే 30 రోజులనూ పవిత్ర రోజులుగా భావిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తుంటారు. వాస్తవానికి దివ్య ఖురాన్‌ లో మానవుడు ఎలా బతకాలి? ఎలా బతకరాదనే విషయాలను అల్లాహ్‌ చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ప్రతి ముస్లిం ఐదు పూటల నమాజ్‌ చేయడంతో పాటు, కష్టాల్లో ఉన్న వాళ్లకు సహాయం చేయడం, హజ్‌ (మక్కా) యాత్రను పూర్తి చేయడం, ఉపవాస ప్రార్థనలు చేయడం, జకాత్‌ లను చెల్లించడం తదితర నియమాలను పాటిస్తే అల్లాహ్‌ అనుగ్రహాన్ని పొందుతాడని నమ్మకం.

రోజూ పండుగే

రంజాన్‌ మాసంలో ప్రతి ముస్లిం ఇంటా ప్రతి రోజూ పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది. కఠోరమైన ఉపవాస దీక్షలను ఆచరిస్తూనే దాన ధర్మాలతో పరుల హితాన్ని కోరుకుంటూ ఉంటారు. అమావాస్య ముగిసిన అనంతరం రెండు రోజులకు రంజాన్‌ మాసం ప్రారంభం కావడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో ఈ నెల 19న రంజాన్‌ మాసం ప్రారంభమవుతుందని ముస్లిం పెద్దలు అంటున్నారు. ఈ మాసంలో తెల్లవారుజామున 4 నుంచి 4.35 గంటల లోపు ఉపవాస దీక్షలు ( రోజా) ప్రారంభమవుతాయి. నమాజ్‌ అనంతరం సాయంత్రం 6.40 గంట వరకూ కనీసం లాలాజలాన్ని సైతం మింగకుండా దీక్షను భక్తిశ్రద్దలతో చేపడుతారు. దాదాపు 14 గంటల అనంతరం ఆ రోజు సాయంత్రం ఉపవాస దీక్షను విరమిస్తారు. ఉపవాసాల ప్రారంభాన్ని సహరీ అని, విరమణను ఇఫ్తార్‌ అని పిలుస్తారు. ఇస్లాంలో రోజా ఉన్న వారికి ఇఫ్తార్‌ విందును ఏర్పాటు చేయడాన్ని పవిత్ర కార్యంగా భావిస్తారు. రోజా సమయంలో ప్రతి రోజూ ఐదు పూటలా నమాజ్‌ చేస్తుంటారు. ఈ మాసం 26వ రోజున రాత్రి జాగారంతో ప్రార్థనలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ముస్లింలకు చాలా ప్రత్యేక మాసం

ఈ నెల 19 నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభం

మూడు దశాబ్దాల తర్వాత ఫిబ్రవరిలోనే ప్రారంభమైన పవిత్ర మాసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement