భూముల రీసర్వే వేగవంతం చేయాలి : జేసీ | - | Sakshi
Sakshi News home page

భూముల రీసర్వే వేగవంతం చేయాలి : జేసీ

Feb 18 2026 7:13 AM | Updated on Feb 18 2026 7:13 AM

భూముల

భూముల రీసర్వే వేగవంతం చేయాలి : జేసీ

శింగనమల: భూముల రీ–సర్వే పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను జాయింట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌ ఆదేశించారు. శింగనలమ మండలం చక్రాయిపేట రెవెన్యూ పరిధిలో మంగళవారం చేపట్టిన భూముల రీ–సర్వే పనులను ఆయన పరిశీలించి, మాట్లాడారు. నిర్దేశించిన సమయంలోపు పనులు పూర్తి కావాలని సిబ్బందికి సూచించారు. రీ–సర్వే నోటీసుల జారీపై రైతులతో ఆరా తీశారు. రీ–సర్వేకు సహకరించాలని రైతులను కోరారు. కార్యక్రమంలో సర్వే ఏడీ రూప్లానాయక్‌, తహసీల్దార్‌ శేషారెడ్డి, డిప్యూటీ తహసీల్దార్‌ నారాయణస్వామి, మండల సర్వేయర్‌, తదితరులు పాల్గొన్నారు. అనంతరం శింగనమలలోని పౌరసరఫరాల శాఖ గోదామును జేసీ పరిశీలించారు. స్టాక్‌ రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. ఆయన వెంట పౌర సరఫరాల శాఖ డీఎం రమేష్‌రెడ్డి ఉన్నారు.

జీడిపల్లి రిజర్వాయర్‌లో చేపల వేటకు రేపు వేలం

బెళుగుప్ప: మండలంలోని జీడిపల్లి గ్రామ రిజర్వాయర్‌లో చేపట వేట కోసం గురువారం ఉదయం 11.30 గంటలకు ఆ గ్రామ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో వేలం నిర్వహించనున్నారు. ఈ మేరకు పీఏబీఆర్‌ మత్స్య కేంద్రం అభివృద్ధి అధికారి పెద్దబాబు నాయక్‌ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వేలం పాటలో పాల్గొనే వారు ఆధార్‌ కార్డు నకలుతో పాటు రూ. 5 వేల ధరావత్తు చెల్లించాలి. వేలం దక్కించుకున్న వారు మొత్తం సొమ్మును చెల్లించాల్సి ఉంటుంది.

బ్రాహ్మణ వ్యతిరేకి చంద్రబాబు

అనంతపురం: సీఎం చంద్రబాబు బ్రాహ్మణ వ్యతిరేకిగా మారారని మాజీ ప్రభుత్వ సలహాదారు (దేవాదాయ శాఖ) జ్వాలాపురం శ్రీకాంత్‌ విమర్శించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ను నమ్మి ఓట్లు వేసిన బ్రాహ్మణులను ఈ ప్రభుత్వం తడి గుడ్డతో గొంతు కోస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ ఇందుకు నిదర్శనమన్నారు. బ్రాహ్మణ సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్‌లో కనీస కేటాయింపులు కూడా లేవన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ బుచ్చి రాంప్రసాద్‌ తన డైరెక్టర్లందర్నీ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రభుత్వం ఏదో గొప్పగా ఇచ్చినట్టుగా ప్రచారం చేయాలని చెబుతుండడం సిగ్గుచేటన్నారు. ఆయనకే కనుక సిగ్గు ఉంటే ముందు కో–ఆపరేటివ్‌ సొసైటీ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో బ్రాహ్మణ కో–ఆపరేటివ్‌ సొసైటీ ఎన్నికలు నిర్వహించి అన్ని బ్యాంకుల ద్వారా వివిధ రకాల స్కీములు అమలు చేశారని గుర్తు చేశారు. ఈ రెండేళ్లలో బ్రాహ్మణ కార్పొరేషన్‌ ద్వారా ఏం సాధించారో శ్వేత పత్రం విడుదల చేయాలని సవాల్‌ విసిరారు.

టీడీపీకి చెందిన వారైతేనే ఇక్కడ పని చేయండి

విడపనకల్లు వెలుగు కార్యాలయంలో ఓ అధికారి వింత పోకడ

విడపనకల్లు: స్థానిక వెలుగు కార్యాలయంలో పని చేస్తున్న ఓ ఉన్నతాధికారి వింత సంస్కృతికి తెర తీశారు. ఆయన పనితీరుపై సొంత శాఖలోని పలువురు విమర్శలు చేస్తున్నారు. కార్యాలయంలో పనిచేయాలంటే టీడీపీకి చెందిన వారే ఉండాలనే కొత్త నిబంధనను తీసుకువచ్చారని వాపోతున్నారు. ఏ చిన్న ఉద్యోగి అయిన సరే టీడీపీకి చెందిన వారే ఉండాలని హుకుం జారీ చేశారన్నారు. అంతేకాక టీడీపీ బడా నేత వద్ద నుంచి ఫోన్‌ కాల్‌ చేయిస్తేనే విధుల్లో చేరనిస్తారని, లేకపోతే స్వచ్ఛందంగా ఉద్యోగం వదిలి వెళ్లాలంటూ బెదిరింపులకు దిగుతున్నారని వాపోతున్నారు. ఆయన పనితీరుతో తాము అక్కడ పనిచేయలేక పోతున్నామని, ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మైక్రో ఫైనాన్స్‌, మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ఉచిత శిక్షణ

అనంతపురం: మైక్రో ఫైనాన్స్‌, మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు ఏఎఫ్‌ ఎకాలజీ సెంటర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వైవీ మల్లారెడ్డి తెలిపారు. ఈ మేర కు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 25 రోజుల పాటు కొనసాగే ఈ శిక్షణకు 20 నుంచి 30 సంవత్సరాల్లోపు వయస్సు, డిగ్రీ ఉత్తీర్ణత, ఆపై కోర్సులు పూర్తి చేసిన వారు అర్హులు. బేసిక్‌ కంప్యూటర్‌ స్కిల్స్‌, లైఫ్‌ స్కిల్స్‌, వర్క్‌ ప్లేస్‌ ఎథిక్స్‌, బేసిక్‌ స్పోకెన్‌ ఇంగ్లిష్‌, కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ స్కిల్స్‌ అంశాల్లో నైపుణ్య శిక్షణను అందిస్తారు. శిక్షణా కాలంలో మధ్యాహ్న భోజనం ఉచితం. శిక్షణానంతరం సర్టిఫికెట్‌ అందజేసి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. పూర్తి వివరాలకు 95024 12002, 91603 72267 లో సంప్రదించవచ్చు.

భూముల రీసర్వే  వేగవంతం చేయాలి : జేసీ 1
1/1

భూముల రీసర్వే వేగవంతం చేయాలి : జేసీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement