‘లీప్‌’ యాప్‌ లోనే ఉత్తర్వులు | - | Sakshi
Sakshi News home page

‘లీప్‌’ యాప్‌ లోనే ఉత్తర్వులు

Feb 18 2026 7:13 AM | Updated on Feb 18 2026 7:13 AM

‘లీప్‌’ యాప్‌ లోనే ఉత్తర్వులు

‘లీప్‌’ యాప్‌ లోనే ఉత్తర్వులు

అనంతపురం ఎడ్యుకేషన్‌: పదో తరగతి పరీక్షల నిర్వహణలో కీలకంగా ఉండే ఇన్విజిలేటర్ల నియామకాలకు సంబంధించి గతంలో మాదిరి పూర్తి జాబితాలు వెలువడవు. ఎవరినైతే నియమించారో వారికి మాత్రమే లీప్‌ యాప్‌లోనే ఉత్తర్వులు వెలువడతాయి. తొలిసారి రాష్ట్రస్థాయిలో ఇన్విజిలేటర్ల నియామకాలు చేపట్టనున్నారు. మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి ఇన్విజిలేటర్ల నియామకాల ప్రక్రియపై కసరత్తు జరుగుతోంది. తొలిసారి ప్రైవేట్‌ పాఠశాలల టీచర్లకు భాగస్వామ్యం కల్పిస్తున్నారు. 75 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న టీచర్లు, 25 శాతం ప్రైవేట్‌ పాఠశాలల టీచర్లను తీసుకోనున్నారు. ఇప్పటికే మొత్తం టీచర్ల జాబితాను రాష్ట్ర అధికారుల నుంచి నేరుగా ఎంఈఓలు, డెప్యూటీ ఎంఈఓలకు పంపారు. 7,615 మంది ప్రభుత్వ టీచర్లు, 4,148 మంది ప్రైవేటు టీచర్ల జాబితాలను పంపి రిమార్కులు అడిగారు. వీరిలో ఎంఈఓల జాబితాలో 2,894 మంది ప్రభుత్వ టీచర్లు, 2,462 మంది ప్రైవేట్‌ టీచర్లు ఉండగా, డీవైఈఓల జాబితాలో 4,721 మంది ప్రభుత్వ టీచర్లు, 1,686 మంది ప్రైవేట్‌ టీచర్లున్నారు.

వీరికి మినహాయింపు

పాలిచ్చే తల్లులు, గత పరీక్షల్లో దుర్వినియోగానికి పాల్పడినవారు, ప్రైవేట్‌ ట్యూషన్లలో పాల్గొంటున్నవారు, ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు, సస్పెన్షన్‌కు గురైనవారు, గర్భిణులు, క్రమశిక్షణ చర్యలు పెండింగ్‌లో ఉన్నవారు, అలాగే తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు, షుగర్‌, హీమోఫీలియా, తలసీమియాతో బాధపడుతున్న పిల్లలున్న టీచర్లకు మినహాయింపు ఉంటుంది. ఇలాంటి కేసులను పరిశీలించిన ఎంఈఓలు, డీవైఈఓలు సంబంధిత ఆధారాలను జతచేసి మినహాయింపునకు సిఫార్సు చేస్తున్నారు. 60 ఏళ్లు నిండిన టీచర్లు, ఐదేళ్ల సర్వీస్‌ పూర్తికాని టీచర్లను పరిగణనలోకి తీసుకోరు. ఎంఈఓ, డీవైఈఓల నుంచి డీఈఓ లాగిన్‌కు వచ్చిన జాబితాలను డీఈఓ ప్రసాద్‌బాబు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఇక్కడి నుంచి జాబితాను డైరెక్టరేట్‌కు పంపనున్నారు.

లాంగ్వేజ్‌ పరీక్షలకు నాన్‌ లాంగ్వేజ్‌ టీచర్లు, నాన్‌ లాంగ్వేజ్‌ పరీక్షలకు లాంగ్వేజ్‌ టీచర్లు

లాంగ్వేజ్‌ పరీక్షలైన తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ పరీక్షల రోజుల్లో నాన్‌ లాంగ్వేజెస్‌ గణితం, సైన్సు, సోషల్‌ టీచర్లను ఇన్విజిలేటర్లుగా నియమించనున్నారు. అలాగే నాన్‌ లాంగ్వెజెస్‌ పరీక్షలకు లాంగ్వెజ్‌ టీచర్లను నియమించనున్నారు.

తప్పులు లేకుండా జాబితా

డైరెక్టరేట్‌ నుంచి నేరుగా ఎంఈఓ, డీవైఈఓలకు టీచర్ల జాబితాలు చేరాయి. వారు పరిశీలించి నిబంధనల మేరకు అనర్హులైన వారిని తప్పించి జాబితాలను డీఈఓ కార్యాలయానికి పంపారు. మేము ఇక్కడ మరోమారు పూర్తిస్థాయిలో పరిశీలించి, ,ఎవరైనా అనర్హులుంటే వారిని తీసేసి డైరెక్టరేట్‌కు పంపుతాం. సాధ్యమైనంత వరకు తప్పులులేని జాబితాను పంపేందుకు చర్యలు తీసుకుంటాం. డైరెక్టరేట్‌ నుంచి ఆన్‌లైన్‌ ద్వారా నియమామ ఉత్తర్వులు జనరేట్‌ చేసి నేరుగా లీప్‌ యాప్‌కు అనుసంధానం చేస్తారు. టీచర్ల మొబైల్‌ నుంచే ఉత్తర్వులు డౌన్‌లోడు చేసుకోవచ్చు.

– ఎం.ప్రసాద్‌బాబు డీఈఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement