పోలీస్ స్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం
● భార్య కాపురానికి రాలేదని అఘాయిత్యం
గుమ్మఘట్ట: భార్య కాపురానికి రాలేదని భర్త పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాలు... రాయదుర్గం మండలం వడ్రహొన్నూరు గ్రామానికి చెందిన దివ్యాంగుడు చౌడప్పకు 18 ఏళ్ల క్రితం డి.హిరేహాళ్ మండలం కల్యం గ్రామానికి చెందిన పార్వతితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాగుడుకు బానిసైన చౌడప్ప జులాయిగా మారడంతో భార్య కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేది. ఈ క్రమంలో భర్త వేదింపులు తారస్థాయికి చేరుకోవడంతో ఆరు నెలల క్రితం ఆమె పుట్టింటికి చేరుకుంది. కాపురానికి రావాలని భార్యను ప్రాధేయపడినా ఆమె అంగీకరించకపోవడంతో మంగళవారం ఉదయం రాయదుర్గం పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తన శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. సకాలంలో గుర్తించిన పోలీసులు అడ్డుకున్నారు. ఘటనపై అర్బన్ సీఐ జయనాయక్ విచారణ చేపట్టారు.
మహిళ హత్య
అనంతపురం సెంట్రల్: అనుమానం ఓ మహిళ హత్యకు దారి తీసింది. ఈ ఘటన అనంతపురం నగరంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... కోవూరునగర్‌లో సోమవారం రాత్రి ఇమ్రాన్, జాఫర్ కుటుంబాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. పొరుగింటిమహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని వర్క్‌ఫ్రం హోం విధానంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న ఇమ్రాన్‌పై సదరు మహిళ బంధువులు దాడి చేశారు. ఆ సమయంలో ఇమ్రాన్ తల్లి గౌసియా (59) అడ్డుకోబోవడంతో ఆమైపె కూడా దాడి చేశారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన గౌసియాను కుటుంబసభ్యులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు.పరిస్థితి విషమించి మంగళవారం ఉదయం ఆమె మృతి చెందింది. ఘటనపై భాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నాల్గో పట్టణ సీఐ జగదీష్ తెలిపారు.
కారు ఢీకొని వ్యక్తి మృతి
డి.హీరేహాళ్(బొమ్మనహాళ్): కారు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... డి.హీరేహాళ్ గ్రామానికి చెందిన పూజారి రుద్ర (48) మంగళవారం సాయంత్రం కుంటు మారెమ్మ ఆలయం వద్ద రోడ్డు దాటుతుండగా బెంగళూరు నుంచి బళ్లారి వైపుగా వెళుతున్న కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన పూజరి రుద్రను చికిత్స నిమిత్తం బళ్లారిలోని విమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ గురుప్రసాదరెడ్డి తెలిపారు.
పోలీస్ స్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం


