●స్పందించని మంత్రి.. ఉద్యమించిన యువత
కూడేరు: అభివృద్ధి దిశగా మంత్రి పయ్యావుల కేశవ్ దృష్టి సారించలేదు. పలు దఫాలుగా అర్జీలు ఇచ్చినా అధికారులు స్పందించలేదు. ప్రభుత్వమూ పట్టించుకోలేదు. దీంతో విసుగు చెందిన కూడేరు మండలం కమ్మూరు గ్రామానికి చెందిన యువకులు శ్రమశక్తితో రోడ్డు మరమ్మతులకు ఉపక్రమించారు. మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కూడేరు నుంచి అరవకూరు, కమ్మూరు, కోటంక, మర్తాడు మీదుగా గార్లదిన్నెకు వాహనాలు అధిక సంఖ్యలో తిరుగుతుంటాయి. అరవకూరు నుంచి కోటంక వరకు తారు రోడ్డు కంకర తేలి, గుంతలు పడి అధ్వానంగా మారింది. ఈ అంశంపై గత ఏడాది డిసెంబర్ 29న ‘అడుగుకో గుంత’ శీర్షికన ‘సాక్షి’లో కథనం వెలువడింది. అయితే అధికారులు కానీ, మంత్రి పయ్యావుల కేశవ్ కాని స్పందించకపోవడంతో చివరకు కమ్మూరుకు చెందిన ఈశ్వరరెడ్డి, జగదీష్‌రెడ్డి, హేమంత్, లోకనాథ రెడ్డి, విష్ణు, అభిషేక్ రెడ్డి, రంజిత్, తమన్ సాయి, మౌని శ్రమదానంతో రోడ్డు బాగు చేసుకున్నారు. ద్విచక్ర వాహనాలపై సంచుల్లో మట్టిని తెచ్చి గుంతలను పూడ్చి చదను చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధి ఈ సర్కార్‌కు పట్టడం లేదని, కనీసం మంత్రి కేశవ్ కూడా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రమదానం చేపట్టిన యువకులను అభినందించారు.
మట్టిని తెచ్చి గుంతలు పూడుస్తున్న దృశ్యం
మట్టి వేసి చదను చేస్తున్న యువకులు
●స్పందించని మంత్రి.. ఉద్యమించిన యువత


