ఆటో బోల్తా.. పలువురికి తీవ్రగాయాలు
హిందూపురం: పట్టణ శివారున శ్రీకంఠపురం చెరువు సమీపంలో సోమవారం ఆటో బోల్తాపడిన ఘటనలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. అనంతపురానికి చెందిన రవి, నాగరాజు కుటుంబసభ్యులు సోమవారం లేపాక్షిలో జరిగిన రథోత్సవంలో పాల్గొని ఆటోలో హిందూపురానికి తిరుగు ప్రయాణమయ్యారు. శ్రీకంఠపురం చెరువు సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఆటో డ్రైవర్ తప్పించే క్రమంలో నియంత్రణ కోల్పోవడంతో బోల్తాపడింది. అందులో ప్రయాణిస్తున్న వారందరూ గాయపడ్డారు. మేళాపురానికి చెందిన గోవిందప్ప తలకు బలమైన గాయమై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అనంతపురం నివాసి రవి తల, ఛాతీకి బలమైన గాయాలయ్యాయి. రెండేళ్ల చిన్నారి యజ్ఞేష్‌కు ఎడమ కాలు విరిగింది. పూజిత, లక్ష్మీదేవి, వర్షితకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఐసీడీఎస్‌లో ఖాళీ పోస్టులకు రేపు ఇంటర్వ్యూలు
అనంతపురం సెంట్రల్: మిషన్ వాత్సల్య పథకం కింద శిశుగృహ, బాలసదనం, వన్‌స్టాప్ సెంటర్‌లో ఖాళీగా ఉన్న పోస్టులకు ఈ నెల 18న కలెక్టరేట్ సమీపంలోని బీసీ స్టడీ సర్కిల్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఐసీడీఎస్ పీడీ అరుణకుమారి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. శిశుగృహలో రెండు ఆయా పోస్టులు, ఒక చౌకదార్ పోస్టు ఖాళీగా ఉందన్నారు. బాలసదనంలో ఎడ్యుకేటర్, ఆర్ట్స్ అండ్ క్రాప్ట్ టీచర్ పోస్టు ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. వన్‌స్టాప్ సెంటర్‌లో సోషల్‌వర్కర్, మల్టీ పర్పస్ స్టాప్ పోస్టు, సెక్యూరిటీ గార్డు పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత ఉండి.. దరఖాస్తు చేసుకోని వారు బుధవారం ఉదయం 10 గంటలకు జరిగే ఇంటర్వ్యూలకు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావచ్చు.
ఆటో బోల్తా.. పలువురికి తీవ్రగాయాలు


