నీళ్లొస్తాయ్‌.. డంప్‌ చేసేద్దాం! | - | Sakshi
Sakshi News home page

నీళ్లొస్తాయ్‌.. డంప్‌ చేసేద్దాం!

Feb 17 2026 7:41 AM | Updated on Feb 17 2026 7:41 AM

నీళ్లొస్తాయ్‌.. డంప్‌ చేసేద్దాం!

నీళ్లొస్తాయ్‌.. డంప్‌ చేసేద్దాం!

చెరువులోకి నీళ్లొస్తాయి. ఎప్పుడు తగ్గుతాయో తెలీదు. నీళ్లుంటే మట్టి తవ్వుకునేందుకు సాధ్యం కాదు. ఇంతలో ‘తెలుగు తమ్ముడి’కి ఓ ఐడియా వచ్చింది. నీళ్లొచ్చేలోపే చెరువు నుంచి మట్టిని తోడేస్తే పోలా? అని అనుకున్నాడు. అంతే చెరువు సమీపంలోని పొలాల్లో పెద్దపెద్ద డంపులు పెట్టేశాడు. వీలునుబట్టి అమ్ముకోవచ్చనే ఆలోచనలో ఉన్నట్టున్నాడు. ఇదీ రాప్తాడు మండలం హంపాపురం చెరువు మట్టి దందాలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ చోటా నాయకుడి నిర్వాకం.

రాప్తాడురూరల్‌: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరాక టీడీపీ నేత ఒకరు హంపాపురం చెరువును చెరబట్టారు. చెరువు నుంచి మట్టి (జీడ)ని అనుమతులు లేకుండా తవ్వి అనంతపురంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పెల్లల తయారీ కేంద్రాలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాడు. స్థానిక ఎమ్మెల్మే కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకుంటూ యథేచ్ఛగా చెరువు మట్టి దందా సాగిస్తున్నాడు. పెద్దపెద్ద గుంతలు తవ్వి సహజవనరులను కొల్లగొడుతూ చెరువు భద్రతను ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాడు. దీంతో స్థానిక రైతులు తిరగబడ్డారు. మట్టిని తరలిస్తున్న టిప్పర్లను అడ్డుకుని రోడ్లపైనే అన్‌లోడ్‌ చేయించారు. ఈ విషయం కాస్తా రచ్చ అయ్యింది. జిల్లా అధికారుల దృష్టికి వెళ్లడంతో తాత్కాళికంగా మట్టి దందాకు అడ్డుకట్ట వేశారు. అయితే సదరు నాయకుడు కొంత బ్రేక్‌ తీసుకున్న తర్వాత మళ్లీ రంగంలోకి దిగాడు. గుట్టుచప్పుడు కాకుండా చెరువు మట్టిని తరలించేస్తున్నాడు. పీఏబీఆర్‌ కుడికాలువ ద్వారా చెరువులోకి నీళ్లు వదిలే సమయం ఆసన్నం కావడంతో ముందుజాగ్రత్తగా చెరువు మట్టిని సమీప ప్రాంతాల్లో డంప్‌ చేస్తున్నాడు.

తప్పుడు విచారణ నివేదికతో కలెక్టర్‌కు బురిడీ

హంపాపురం చెరువు మట్టి అక్రమ రవాణాపై కొందరు గ్రామస్తులు ఇటీవల ప్రజాసమస్యల పరిష్కార వేదికలో స్వయంగా కలెక్టర్‌ను కలిసి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బరి తెగించి చెరువు మట్టిని కొల్లగొడుతున్నా అధికారులు కనీస చర్యలు తీసుకోలేదని వాపోయారు. అనంతరం కలెక్టర్‌ ఈ ఫిర్యాదును గనులు, భూగర్భ శాఖ అధికారికి పంపి విచారణకు ఆదేశించారు. అయితే వారు ఇచ్చిన విచారణ నివేదిక చూస్తే ఔరా అనిపిస్తుంది. తమ సిబ్బంది రెవెన్యూ సిబ్బందిని విచారించగా ‘కొందరు రైతులు వారి పంట పొలాలలకు ఈ చెరువు మట్టిని ఉపయోగిస్తున్నారు’ అంటూ స్వయంగా కలెక్టర్‌కు తప్పుడు నివేదిక ఇవ్వడం గమనార్హం. గ్రామ రైతులు వారి పంటపొలాలకు ఉపయోగించుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదని, ఓ వ్యక్తి అక్రమంగా అనంతపురం తరలిస్తున్నారని అధికారులకు ఫొటోలు, వీడియోలు చూపించినా చర్యలు తీసుకోవాల్సిన అధికారులే ఇలా తప్పుడు నివేదికలతో ఉన్నతాధికారులను బురిడీ కొట్టిస్తే ఎలా? అని గ్రామస్తులు వాపోతున్నారు. చెరువు మట్టి అక్రమ తరలింపు వ్యవహారం మైనర్‌ ఇరిగేషన్‌, రెవెన్యూ, పోలీసు, విజిలెన్స్‌, గనులు, భూగర్భశాఖల అధికారులందరికీ తెలుసని అంటున్నారు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు ఓసారి వచ్చి చెరువు ప్రాంతాన్ని పరిశీలించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

పొలంలో డంప్‌ చేసిన చెరువు మట్టి

హంపాపురం చెరువు నుంచి అక్రమంగా మట్టి తరలింపు

పీఏబీఆర్‌ కుడికాలువకు నీళ్లొస్తాయని ‘తమ్ముడి’ తెలివి

చెరువు సమీపంలోనే భారీ డంప్‌లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement