పది పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
అనంతపురం అర్బన్: పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆనంద్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై కలెక్టర్ సోమవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమీక్షించారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు పదో తరగతి పరీక్షలు, మార్చి 16 నుంచి 28 వరకు ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ (ఏపీఓఎస్‌ఎస్) పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లావ్యాప్తంగా 592 పాఠశాలలకు చెందిన 33,260 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాస్తుండగా, 71 ఓపెన్ స్కూల్‌కు సంబంధించి 1,045 మంది విద్యార్థులు 143 కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారన్నారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
‘ఓపెన్’ ఇంటర్ పరీక్షలు
ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియెట్ పరీక్షలు మార్చి 2 నుంచి 13 వరకు జరగనున్నాయని కలెక్టర్ తెలిపారు. 38 ఓపెన్ ఇంటర్మీడియెట్ స్కూల్స్ నుంచి 2,479 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు. తొమ్మిది కేంద్రాల్లో నిర్వహించే పరీక్షలు సజావుగా జరిలేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రత్యేక బస్సులు నడపాలి
పరీక్షల సందర్భంగా విద్యార్థుల సౌకర్యార్థం ప్రత్యేకంగా బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వేసవి దృష్ట్యా విద్యార్థుల సౌకర్యార్థం పరీక్ష కేంద్రాల్లో ఫ్యాన్‌లు ఏర్పాటు చేయాలని, విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవాలన్నారు. ప్రతి కేంద్రం వద్ద ఒక ఏఎన్‌ఎం, ఫస్ట్ ఎయిడ్ కిట్ కచ్చితంగా ఉండాలన్నారు. కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు పటిష్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్‌ఓ మలోల, డీఈఓ ప్రసాద్‌బాబు, పరీక్షల నిర్వహణ కమిటీ, ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి వెంకటరమణ నాయక్, నగర పాలక సంస్థ కమిషనర్ జశ్వంత్‌రావు, ఆర్టీసీ ఆర్‌ఎం శ్రీలక్ష్మి, నగర పాలక ఈఈ షాకీర్, బీసీ వెల్ఫేర్ డీడీ కుష్బు కొఠారి, కార్మి శాఖ డీసీ లక్ష్మీనరసయ్య, ఏపీఎస్‌పీడీసీఎల్ ఏఈ మహబూబ్‌బాషా తదితరులు పాల్గొన్నారు.
ప్రతి విద్యార్థికీ ఆల్బెండజోల్ మాత్ర వేయాలి
నులిపురుగుల నిర్మూలన కోసం ప్రతి విద్యార్థికీ నిర్దేశించిన మోతాదు మేరకు అల్బెండజోల్ మాత్ర వేయాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం నుంచి ఈ నెల 24 వరకు చేపట్టనున్న డీ వార్మింగ్ డే పోస్టర్లను సోమవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ఆదేశించారు. పిల్లల్లో నులిపురుగుల కారణంగా వివిధ ఆరోగ్య సమస్యలు వస్తాయన్నారు. జిల్లాలో 1 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు ఉన్న పిల్లలు 5,99,852 మంది ఉన్నారన్నారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా మంగళవారం అన్ని విద్యాసంస్థల్లోనూ విద్యార్థులందరికీ తప్పనిసరిగా అల్బెండజోల్ మాత్రలు వేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ మలోల, ఐడీఎస్‌పీ నోడల్ అధికారి సురేంద్రరెడ్డి, ఆర్‌బీఎస్‌కే నోడల్ అధికారి విష్ణుమూర్తి, జిల్లా ప్రోగ్రాం అధికారి రజిత, డీఈఓ ప్రసాద్‌బాబు, నగర పాలక సంస్థ కమిషనర్ జశ్వంత్‌రావు, డీఎంఓ ఓబులు, ఆర్‌ఐఓ వెంకటరమణనాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.


