ఉద్యాన హామీలు ఉత్తుత్తివే!
అనంతపురం అగ్రికల్చర్: ఏడాదిలోపు జిల్లాను ‘ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియా’గా మారుస్తామని, ఫలసాయంలో ‘లోకల్ టు గ్లోబల్’గా ‘అనంత’ బ్రాండ్‌ను క్రియేట్ చేస్తామని, ఉద్యాన రైతుల తలరాతలు మార్చి ఆర్థికంగా గట్టెక్కిస్తామని ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ 2025 ఫిబ్రవరి 5న అనంతపురం వేదికగా నిర్వహించిన ‘హార్టికల్చర్ కాంక్లేవ్’లో ప్రకటించారు. దేశ నలుమూలల నుంచి 64 కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు హాజరైనట్లు చెప్పుకున్నారు. ఉద్యాన రైతులకు చేదోడు వాదోడుగా ఫలసాయానికి మంచి మార్కెటింగ్ జరిగేలా, రైతులకు మంచి లాభాలు వచ్చేలా చేయడానికి వీలుగా ఆరు కంపెనీలతో ఎంవోయూ (ఒప్పందాలు) చేసుకున్నట్లు ప్రకటించారు. ఏడాది పూర్తయినా ఆ ఎంవోయూలు అమలుకు నోచుకోక ఉత్తుత్తివిగా మిగిలిపోయాయి.
కనిపించని ‘కాంక్లేవ్’ ప్రభావం..
రాష్ట్ర స్థాయి ఉద్యాన సదస్సు (కాంక్లేవ్) రైతులకు ఏ మాత్రమూ ప్రయోజనం చేకూర్చలేకపోయింది. దాని ప్రభావం మచ్చుకై నా కనిపించని పరిస్థితి ఏర్పడింది. చీనీ, మామిడి, ఎండుమిరప, అరటి, టమాట పంటలను ఐదు ప్రధాన గ్రోత్ ఇంజిన్లుగా గుర్తించినా.. రైతులకు ఒనగూరిన ప్రయోజనం లేదు. ఏడాది పొడవునా చీనీ రైతులు నష్టాలు మూటగట్టుకున్నారు. కనీసం నెల రోజులు కూడా మంచి ధరలు లభించక.. టన్ను ధర సగటున రూ.15 వేలకే పరిమితం కావడంతో చీనీ రైతులు రూ.కోట్లు కోల్పోయారు. ఇక టమాట, అరటి పరిస్థితీ అంతంత మాత్రమే. ఒక దశలో టన్ను రూ.2 వేలకు పతనం కావడంతో అరటి రైతుల ఆక్రందనలు అమరావతి, ఢిల్లీని తాకాయి. ఎండుమిరప సాగు సగానికి పడిపోవడం గమనార్హం. మామిడిదీ అదే పరిస్థితి కావడంతో ఐదు గ్రోత్ ఇంజిన్లు డౌన్‌ఫాల్ కావడం గమనార్హం. మిగతా ఉద్యాన ఉత్పత్తులకు కూడా ఈ ఏడాది మార్కెట్ కలిసిరాకపోవడంతో 60 నుంచి 70 శాతం మంది రైతులకు నష్టాలే మిగిలాయి.
ముందుకు సాగని ఎంవోయూలు..
ఉద్యాన కాంక్లేవ్‌ను ఇక నుంచి ప్రతి ఏటా నిర్వహించి కార్పొరేట్ కంపెనీల సహకారంతో రైతుల తలరాతలు మార్చేస్తామని మంత్రి పయ్యావులతో పాటు కాంక్లేవ్‌కు హాజరైన మిగతా ప్రజాప్రతినిధులు, అలాగే ప్రభుత్వం నుంచి మెంటర్‌గా హాజరైన స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి.రాజశేఖర్, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సీఈవో గెడ్డం శేఖర్‌బాబు ప్రకటించారు. ఆరు కార్పొరేట్ కంపెనీలతో కుదుర్చుకున్న ‘ఎంవోయూ’ (ఒప్పందాలు)లు ఉత్తుత్తివిగా మిగిలిపోయాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మైక్రో ఆల్గే సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఏఎస్‌ఐ) ఏసియా పసిఫిక్ ప్రెసిడెంట్ డెబాబ్రతా సర్కార్, అనంతపురం జిల్లాకు చెందిన సిద్ధార్థ కోల్డ్‌కేర్ ప్రొప్రైటర్ సిద్ధార్థరెడ్డి, కృష్ణా జిల్లాకు చెందిన కోసూరి బాలాజీ ఆగ్రో ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ కె.శ్రీనివాసరావు, తెలంగాణ, మల్కాజ్‌గిరి జిల్లాకు చెందిన గ్రీన్ గురుకులం ఫౌండర్ రాజాచాంద్, ఢిల్లీకి చెందిన ఆగ్రో లైఫ్ సైన్స్ కార్పొరేషన్ ఏపీ, తెలంగాణ స్టేట్ హెడ్ ఎం.ప్రసాద్, అనంతపురానికి చెందిన అనానఫిట్ నాచురల్ ఫైబర్ వీవర్ క్లస్టర్ ఫౌండర్ సి.శేఖర్ తదితరులతో కుదుర్చుకున్న ఎంవోయూలు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అనంత ఉద్యాన ఉత్పత్తులను లోకల్ టు గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే క్రమంలో ప్రకటించిన యాక్షన్ ప్లాన్ కూడా అట్టర్ ఫ్లాప్ కావడం గమనార్హం.
హార్టికల్చర్ ‘కాంక్లేవ్’ పూర్తయి ఏడాదైనా అమలుకు నోచుకోని ఎంఓయూలు
‘అనంత’ను ఫ్రూట్‌బౌల్ ఆఫ్
ఇండియాగా, లోకల్ టు గ్లోబల్
అంటూ గొప్పలు పోయిన మంత్రి
దిగుబడి పెంచి, నష్టాలు తగ్గించి, రైతులను ఆర్థికంగా గట్టెక్కిస్తామన్న పాలకులు
వాస్తవంగా ఏడాది పొడవునా
చీనీకి నష్టాలే.. అరటి, టమాటాల పరిస్థితీ అంతంతే
ఉద్యాన హామీలు ఉత్తుత్తివే!
ఉద్యాన హామీలు ఉత్తుత్తివే!


