ఇళ్ల నిర్మాణాలు ఆపిన పాపం మీదే | - | Sakshi
Sakshi News home page

ఇళ్ల నిర్మాణాలు ఆపిన పాపం మీదే

Feb 9 2026 7:36 AM | Updated on Feb 9 2026 7:36 AM

ఇళ్ల నిర్మాణాలు ఆపిన పాపం మీదే

ఇళ్ల నిర్మాణాలు ఆపిన పాపం మీదే

అనంతపురం ఎడ్యుకేషన్‌: ‘వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిరుపేదల కోసం కేంద్రం నుంచి 20 లక్షల ఇళ్లను మంజూరు చేయించి నిర్మాణాలు చేపడితే.. వాటిని పూర్తిచేయకుండా అడ్డుకున్న పాపం మీదే’నని చంద్రబాబు ప్రభుత్వంపై రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం కూలిపోయే పేకమేడ అని అన్నారు. వైఎస్‌ జగన్‌, ఆయన వెంట నిలబడిన వారి క్యారెక్టర్లను దెబ్బతీసేందుకు ఎల్లోమీడియా ప్రయత్నం చేస్తోందన్నారు. చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడింది ఎల్లో మీడియా రాస్తుందని, వీరు రాసిందే వారు మాట్లాడతారని పేర్కొన్నారు. అదే ప్రజలు నమ్మాలి అని భావిస్తున్నారన్నారు.

ఇళ్ల నిర్మాణాల్లో ప్రభుత్వం విఫలం..

ఇళ్ల నిర్మాణాల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. గత ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్లల్లోనే ఇటీవల గృహప్రవేశాలు చేశారని ఎద్దేవా చేశారు. రూ.1.80 లక్షలకే నిర్మిస్తున్న ఇళ్లల్లోనూ కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు 5–10 శాతం కమీషన్లు ఆశిస్తున్నారన్నారు. అధికారంలో వచ్చి 20 నెలలవుతున్నా ఇళ్ల నిర్మాణాల్లో ఏమి అభివృద్ధి సాధించారని ప్రశ్నించారు. రాష్ట్ర వాటా యూనిట్‌కు రూ.30 వేలు చొప్పున కేంద్రానికి చెల్లించాల్సి ఉండగా ఒక్క రూపాయి కూడా చంద్రబాబు ప్రభుత్వం చెల్లించలేదన్నారు. ఈ కారణంగానే కేంద్ర ప్రభుత్వం 3 లక్షల ఇళ్లను రద్దు చేసిందని తెలిపారు.

రాక్రీట్‌ సంస్థపై ఎల్లోమీడియా దుష్ప్రచారం

ఇళ్ల నిర్మాణాలను రాక్రీట్‌ సంస్థ పట్టించుకోలేదని ఎల్లోమీడియా మళ్లీ దుష్ప్రచారం చేస్తోందని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ప్రభుత్వ పెద్దలు గాడిదలు కాస్తున్నారా? అనేది మాత్రం రాయలేదన్నారు. ఇళ్ల నిర్మాణ స్కీం మనుగడ ప్రశ్నార్థకమవుతున్న నేపథ్యంలో గత ప్రభుత్వంపై ఎల్లో మీడియా నిందారోపణలు చేస్తోందన్నారు. ఇంగితజ్ఞానం లేని మూర్ఖురాలు పరిటాల సునీత ఇచ్చిన లేఖను పట్టుకునే రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాలు ఆపేశారనేది ఎల్లో మీడియాకు తెలీదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాక్రీట్‌ సంస్థ చేపట్టిన ఇళ్ల నిర్మాణాలపై విజిలెన్స్‌ విచారణ జరపాలంటూ పరిటాల సునీత రాసిన లేఖతో పనులను ఆపేశారన్నారు. రూ.38 కోట్లు బిల్లులు రావాలని రాక్రీట్‌ సంస్థ హైకోర్టును ఆశ్రయించిందన్నారు. ఈ బిల్లులు చెల్లిస్తే తక్కిన పనులన్నీ పూర్తి చేస్తామని 2024లో సదరు సంస్థ కోర్టుకు నివేదించిందన్నారు. దీనిపై ప్రభుత్వం కనీసం కౌంటర్‌ దాఖలు చేయలేదన్నారు. మరి ఎల్లో మీడియా ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. కేవలం తనను అప్రతిష్టపాలు చేసేందుకు రాక్రీట్‌ సంస్థపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. తనపై పచ్చమీడియాలో బూతు వార్తలు రాయించి పరిటాల సునీతను తృప్తి పరుస్తున్నారన్నారు. జగనన్నకాలనీల్లో చాలావరకు సిమెంటు, ఇసుక, పెల్లలు, సెంట్రింగ్‌ సామాన్లు, కడ్డీలు, మిషనరీల మోటార్లు ఎత్తుకెళ్లి రూ.20 కోట్ల దాకా నష్టం కల్గించారని పేర్కొన్నారు. మరో రూ. 30 కోట్ల విలువైన మిషనరీ తదితరాలు వృథాగా ఉన్నాయన్నారు. రూ. 38 కోట్లు బిల్లులు సంస్థకు రావాల్సి ఉందన్నారు.

మీరే నిర్మాణాలు చేపట్టండి..

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పేదల ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఎవరితో చేయించినా తమకు అభ్యంతరం లేదన్నారు. అవసరమైతే రాక్రీట్‌ సంస్థ వద్ద ఉన్న అన్ని మిషనరీలు ఎలాంటి చార్జీలు లేకుండా ఉచితంగా ఇచ్చి సహకరిస్తామని చెప్పారు. పేదలకు చెందిన 50 వేల ఇళ్ల నిర్మాణాలు జరగకుండా అడ్డుకున్న ప్రతి ఒక్కరినీ వెతికి, వేటాడి వేటాడి మరీ చట్టం ముందు ఉంచి శిక్ష పడేలా చేస్తామన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగిపోయిన ఇళ్లన్నీ పూర్తి చేస్తామన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు రంగంపేట గోపాల్‌రెడ్డి, గంగుల సుధీర్‌రెడ్డి, మీనుగ నాగరాజు, బోయ రామాంజి, ఉప్పరపల్లి శీనా, నారాయణరెడ్డి, రాప్తాడు శేఖర్‌, బండి పవన్‌, మాదన్న, బిల్లే మంజునాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

పరిటాల సునీత లేఖ ఆధారంగా పనులు నిలిపేశారు

ఇళ్ల నిర్మాణాల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది

గత ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్లల్లోనే ఇటీవల గృహప్రవేశాలు

ఎల్లో మీడియాలో రాక్రీట్‌ సంస్థపై

నిందారోపణలు చేయిస్తారా?

రాప్తాడు మాజీ ఎమ్మెల్యే

తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ధ్వజం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement