గుంతకల్లులో మితిమీరిన అరాచకాలు
● మాజీ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి
గుంతకల్లుటౌన్: ప్రశాంతతకు మారుపేరుగా నిలిచిన గుంతకల్లు నియోజక వర్గంలో అధికార పార్టీ నేతల అరాచకాలు, దౌర్జన్యాలు మితిమీరిపోయాయని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకట రామిరెడ్డి మండిపడ్డారు. గురువారం వైవీఆర్ తన నివాసంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. గుత్తి–యాడికి మార్గంలో స్థానిక ఎమ్మెల్యే జయరామ్ స్టిక్కర్ కలిగిన కారులో ప్రయాణిస్తున్న ఓ రౌడీషీటర్ గంజాయి మత్తులో విధినిర్వహణలో ఉన్న పోలీసులపైనే రెచ్చిపోవడం అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన గుంతకల్లు రెండో గోవాగా పేరొందిందన్నారు. గల్లీకో బెల్ట్‌షాపు, విచ్చలవిడిగా లభ్యమవుతున్న గంజాయి కారణంగా యువత పెడదారి పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మత్తుపదార్థాల వినియోగం ద్వారా యువత భవిష్యత్తు నాశనమయ్యే అవకాశముందని, పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని గంజాయి, ఇతర మత్తుపదార్థాల విక్రయాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు. అలాగే గంజాయి మత్తులో పోలీసులపైనే వీరంగం సృష్టించిన వారిని కఠినంగా శిక్షించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.


