ఎల్‌ఆర్‌ఎస్ ఫైళ్లపై అలసత్వం వీడాలి
అనంతపురం క్రైం: ఎల్‌ఆర్‌ఎస్ ఫైళ్లపై అలసత్వం వీడాలని, లేని పక్షంలో తాను కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని ఇన్‌చార్జ్ కలెక్టర్, అహుడా వైస్ చైర్మన్ సి. విష్ణుచరణ్ అన్నారు. గురువారం స్థానిక అహుడా కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో ప్రజల నుంచి ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనధికార లేఅవుట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు తీసుకొచ్చిన ఎల్‌ఆర్‌ఎస్–2020 పథకాన్ని నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. పెండింగ్ దరఖాస్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బిల్డింగ్ ఫైనలైజేషన్ స్కీమ్‌ను తక్షణమే ప్రారంభించాలన్నారు. అర్బన్ పరిధిలో ఏర్పాటు చేస్తున్న పింక్ టాయిలెట్లు, స్విమ్మింగ్ పూల్ పనులను త్వరగా పూర్తిచేసి ప్రారంభించాలన్నారు. ఎంఐజీ లేఅవుట్లలో పెండింగ్ పేమెంట్ల వసూలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. గుండంకోనేరు టెండర్లను మళ్లీ పిలవాల్సిన అవసరం ఉందని సూచించారు. అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా వెంటనే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో అహుడా చైర్మన్ టి.సి.వరుణ్, సెక్రటరీ జి.రామకృష్ణారెడ్డి, డీఈ రేవంత్, ఈఓ అరుణకుమారి, ఏఓ రవిచంద్రన్, కేఎండీ ఇషాక్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ దుష్యంత్, జీపీఓ హరీష్ చౌదరి, సర్వేయర్ శరత్ తదితరులు పాల్గొన్నారు.
కుటుంబ సర్వే వేగవంతం చేయాలి
అనంతపురం అర్బన్: ఏకీకృత కుటుంబ సర్వే వేగవంతానికి చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ ఆదేశించారు. వివిధ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ గురువారం విజయవాడ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి ఇన్‌చార్జ్ కలెక్టర్‌తో పాటు డీఆర్‌ఓ ఎ.మలోల, ఇతర అధికారులు పాల్గొన్నారు. సీఎస్ వీసీ అనంతరం అధికారులతో ఇన్‌చార్జ్ కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలు మెచ్చేలా పనితీరు ఉండాలన్నారు. ఏకీకృత కుటుంబ సర్వే గడువులోపు పూర్తికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏజెంట్ స్పేస్ డాక్యుమెంట్ల అప్‌లోడ్ ప్రక్రియలో పురోగతి ఉండాలని చెప్పారు. ‘ఐ–గాట్ కరమ్ యోగి’కి సంబంధించిన ఆన్‌లైన్ కోర్సులను ఆయా శాఖల అధికారులు తప్పనిసరిగా పూర్తి చేయాలన్నారు. ఎంఎస్‌ఎంఈల ఏర్పాటు, ఐఎంఎస్ ఆస్పత్రుల నిర్మాణానికి భూమి కేటాయింపు అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.


