ఇవీ డగౌట్‌పాండ్లే!
● తెలుగు తమ్ముళ్లకు ‘ఉపాధి’లా మారిన వాటర్‌షెడ్ పనులు
● తూతూ మంత్రంగా పనులు చేసి బిల్లులు చేసుకుంటున్న వైనం
● ఇక్కడ కనిపిస్తున్నది యర్రెద్దుల గుట్ట కింద తవ్విన గుంత. ఇక్కడైతే పెద్ద గుంత తవ్వారు కానీ గుట్ట నుంచి కిందికి దిగే ప్రాంతంలో తవ్విన ఈ గుంతలోకి నీళ్లు వచ్చేలా చేయలేదు. గుంతలోకి నీరు ప్రవహించేందుకు ఒక అడుగు దాకా ఎత్తు ఉండడంతో దిగువ వైపునకు వెళ్తాయి తప్ప గుంతలోకి నీరు ప్రవహించే అవకాశం లేదు. దీనికోసం రూ.1,94,278 ఖర్చు చేశారు. రైతుల కంటే కూడా కాంట్రాక్టర్ అవతారమెత్తిన తెలుగు తమ్ముళ్లకు ‘ఉపాధి’ కల్పించేందుకే ఈ డగౌట్‌పాండ్లు నిర్మించారనేది అర్థమవుతోంది.
● ఇక్కడ కనిపిస్తున్నది రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లికి వెళ్లేదారిలో ఫ్యాక్టరీల వెనుకవైపు ఉన్న తుమ్మచెట్ల గుట్టలో తవ్విన డగౌట్ పాండ్. గతంలో మట్టి కోసం తవ్విన గుంతకు చుట్టూ కాస్త మట్టిపోశారు. వర్షం నీరు వచ్చినా ఇక్కడ నిలువ ఉండే పరిిస్థితి లేదు. హంపాపురం వాటర్‌షెడ్ కింద చేపట్టిన ఈ పాండ్‌కు రూ.1,95,226 అంచనా రూపొందించి ఖర్చు చేశారు. బిల్లుకూడా చేసుకున్నట్లు తెలిసింది. ఎవరైనా వచ్చి ఈ డగౌట్ పాండ్‌ను పరిశీలిస్తే ‘ఔరా...ఇదీ కూడా డగౌట్ పాండేనా’ అని ఆశ్చర్యమేస్తుంది.
రాప్తాడురూరల్: కరువుకు నిలయంగా మారుతున్న అనంతపురం లాంటి జిల్లాల్లో ఫారంపాండ్‌ల వల్ల చాలా ఉపయోగం. వీటిద్వారా వర్షం నీటిని నిల్వ చేసి, సాగునీటి అవసరాలకు వినియోగించడంతో పాటు భూమిలోకి ఇంకి చుట్టు పక్కల బావులు, బోర్లలో భూగర్భ జలాలు పెరుగుతాయి. అలాంటి పాండ్ల నిర్మాణాల్లో క్షేత్రస్థాయి సిబ్బంది సహకారంతో అధికార టీడీపీ నాయకులు అక్రమాలకు తెర తీస్తున్నారు.హంపాపురం సమీపంలోని చింతతోపులో ఏళ్లనాటి పెద్దపెద్ద చింతచెట్లను ధ్వంసం చేసి డగౌట్ పాండ్లు నిర్మించారు. హంపాపురం వాటర్‌షెడ్‌కు సంబంధం లేని జంగాలపల్లి గ్రామానికి చెందిన చెరువులో గుంతలు తవ్వారు. హంపాపురం చెరువులోనూ గుంతలు తవ్వారు. చెరువుల్లో గుంతలు ఎవరికి ఉపయోగపడతాయని రైతులు ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో కొందరు నాయకుల బరితెగింపు పట్ల ఆ పార్టీ చోటా నాయకులే మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టకపోతే మరిన్ని అక్రమాలకు పాల్పడతారని రైతులు వాపోతున్నారు.
ఇవీ డగౌట్‌పాండ్లే!


