నమ్మక ద్రోహం
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇస్తున్న దాని కంటే రెట్టింపు ఇస్తామని ఎన్నికల సమయంలో హామీలు గుప్పించారు. సహజ మరణానికై తే రూ.5 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షలు ఇస్తామంటూ ఎన్నికలప్పుడు ఊరూరా తిరిగి నమ్మించారు. మేనిఫెస్టోలోనూ ముద్రించి ఇంటింటికీ పంచారు. తీరా అధికారం చేపట్టాక ఎప్పటిలాగే మరచిపోయారు. దరఖాస్తు చేసుకునేందుకు అసలు వెబ్‌సైటే లేకుండా చేశారు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు కావొస్తున్నా బీమా పథకంపై ఎటువంటి ప్రకటనా చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నమ్మకద్రోహం చేసిన బాబుపై పేదలు మండిపడుతున్నారు.
బొమ్మనహాళ్: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అమలు చేసిన వైఎస్సార్ బీమా పథకం పేరును చంద్రన్న బీమాగా మార్చిన చంద్రబాబు ప్రభుత్వం అమలును మాత్రం గాలికొదిలేసింది. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో 6,74,353 తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వీరంతా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారే. అంత్యోదయ, తెల్ల రేషన్‌కార్డులు కలిగిన వారందరూ చంద్రన్న బీమా పథకానికి అర్హులు.ప్రమాదవశాత్తు ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరిని మృత్యువు వెంటాడుతూనే ఉంటుంది. జిల్లాలో ఏటా 800 నుంచి 1,000 సాధారణ మరణాలతో పాటు దాదాపు 250 మంది ప్రమాదాల్లో ప్రాణాలు విడుస్తున్నట్లు సమాచారం. వివిధ ప్రమాదాల వల్ల వందల మంది వైకల్యం బారిన పడి మంచాల్లో మగ్గుతున్నారు. బీమా లేకపోవడంతో బాధిత కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. తమ లాంటి వారికి బీమా అమలు చేస్తే ఎంతో ఉపశమనం కలిగేదని బాధిత కుటుంబాలు పేర్కొంటున్నాయి.
అప్పట్లో పక్కాగా అమలు..
వైఎస్సార్‌సీపీ హయాంలో వైఎస్సార్ బీమా పథకాన్ని పక్కాగా అమలు చేశారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి పేదోడికి ఆనాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేయూతనందించారు. అధికారులు నేరుగా బాధితుల వద్దకే వెళ్లి బీమా నగదు అందించారు. సవ్యంగా సాగుతున్న ఈ పథకానికి చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక గ్రహణం పట్టింది.
సభ్యత్వాలు ఉంటేనే బీమా..
పేద ప్రజలందరికీ బీమా అందించేందుకు చంద్ర బాబు ప్రభుత్వానికి మనసు రావడంలేదు. టీడీపీ, జనసేన పార్టీల సభ్యత్వాలు తీసుకుంటేనే ఇన్సూరెన్సు వర్తిస్తుందంటూ ప్రచారం చేస్తున్నారు. పార్టీ సభ్యత్వాలు తీసుకున్నవారికే ఇన్సూరెన్సు సౌకర్యం కల్పిస్తూ పేద ప్రజలను పక్కన పెట్టేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
హామీల అమలుపై చిత్తశుద్ధి లేదు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రేషన్‌కార్డు ఉన్న కుటుంబ పెద్ద మరణిస్తే వలంటీర్లు వారి వివరాలు సేకరించి బీమా డబ్బును అందించేవారు. ఇప్పుడు అలాంటివి ఎక్కడా కానరావడం లేదు. అసలు చంద్ర బాబుకు హామీల అమలుపై చిత్తశుద్ధి లేదు. బీమా పథకాన్ని అమలు చేస్తే పేద కుటుంబాలకు ఎంతోకొంత ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది.
– పరమేష్, నేమకల్లు గ్రామం, బొమ్మనహాళ్ మండలం
వెంటనే అమలు చేయాలి
ఎన్నికల హామీల్లో భాగమైన చంద్రన్న బీమా పథకాన్ని తక్షణమే అమలు చేయాలి. రేషన్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ పథకం ఉపయోగకరం. కూలి పనులు చేసుకుని జీవించే కుటుంబాలకు బీమా పథకం ఎంతో అండగా ఉంటుంది. బీమా నగదు రూ. 10 లక్షలకు పెంచి అందిస్తామని చెప్పారు. నేడు దాని గురించి ఎవరూ మాట్లాడటమే లేదు.
–ఎంసీహెచ్ రాజ్‌కుమార్, దేవగిరి, బొమ్మనహాళ్ మండలం
మార్గదర్శకాలు వెలువడలేదు
బీమా పథకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి మార్గదర్శకాలూ వెలువడలేదు. ఈ పథకానికి సంబంధించిన వెబ్‌సైట్ లేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే పథకాన్ని అమలు చేస్తాం.
– గంగన్న, ఏపీఎం, బొమ్మనహాళ్
మోసం బాబూ..
రేషన్‌కార్డుదారులకు వర్తించని చంద్రన్న బీమా
సృష్టత ఇవ్వని ప్రభుత్వం
ఎన్నికల మేనిఫెస్టోకు మాత్రమే పరిమితం
కుటుంబ పెద్దను కోల్పోతే పరిహారం శూన్యం
దగాపై మండిపడుతున్న సామాన్యులు


