తారస్థాయికి వసూళ్ల పర్వం
అనంతపురం క్రైం: అమాయకుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. అక్రమార్జనే పరమావధిగా విధులు నిర్వర్తిస్తున్నారు. క్షణాల్లో పేరు మార్పు, గుత్తలు తగ్గింపు ఒకటేమిటి చేతులు తడిపితే చాలు ఏదైనా చేసేస్తున్నారు. అనంతపురం నగర పాలక సంస్థలో రెవెన్యూ విభాగం అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డబ్బులడిగారని ఇటీవల రెవెన్యూ కార్యాలయం సిబ్బందే ఉన్నతాధికారుల ముందు వాగ్వాదం చేశారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
వసూళ్ల పర్వం..
నగరంలో 74 వార్డు సచివాలయాలు ఉండగా, ప్రతి వార్డు సచివాలయం నుంచి నెలకు రూ.5 వేల చొప్పున అర్బన్ ప్రజా ప్రతినిధి పేరుతో వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పై నుంచి ఆదేశాలు అంటూ ప్రతి నెలా రూ.3 లక్షలు పంపిస్తున్నారన్న ప్రచారం నగరపాలక వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇంటి, ఆస్తుల కొనుగోలు–అమ్మకాల అనంతరం జరిగే నేమ్ చేంజ్ ప్రక్రియ కూడా ఆదాయ వనరుగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. కావాలనే ఆలస్యం చేసి, చివరికి అందినంత దండుకుని పనులు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. 60వ సచివాలయ పరిధిలో ఓ ఆర్‌ఓ తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఇద్దరు అడ్మిన్‌లను అడ్డుపెట్టుకుని వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. బాధితులు అడిగినంత ఇవ్వకపోవడంతో ఆ ఆర్వో 50కి పైగా ఫైళ్లు పెండింగ్ పెట్టినట్లు తెలిసింది. కొత్తగా ఇల్లు నిర్మించుకున్న వారికి కొత్త డోర్ నంబర్ ఇవ్వడానికి కూడా ఏళ్ల తరబడి తిప్పుకుంటున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న పలువురు కిందిస్థాయి ఉద్యోగులు ఆర్వో (రెవెన్యూ ఆఫీసర్) పోస్టు దక్కించుకునేందుకు లాబీయింగ్‌తో పాటు ప్రజాప్రతినిధితో డీల్స్ చేసుకుంటున్నట్లు సమాచారం.
పట్టని ఉన్నతాధికారులు
రెవెన్యూ విభాగంలో అంతా ఇష్టారాజ్యంగా తయారైనా సదరు విభాగాన్ని ప్రక్షాళన చేయడానికి ఏ ఒక్క అధికారి ముందుకు రాక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. శుక్రవారం అనంతపురం రీజియన్‌కు సంబంధించి 42 మునిసిపాలిటీల కమిషనర్లతో జేఎన్‌టీయూలో ఉన్నతస్థాయి సమావేశం జరగనున్న నేపథ్యంలో నగరపాలక సంస్థపై దృష్టి సారించి ‘రెవెన్యూ’ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని నగరవాసులు కోరుతున్నారు.
● కొన్ని నెలల క్రితం సీడీఎంఏ హరినారాయణ్ అనంతపురంలోని రామ్‌నగర్‌లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఓ కమర్షియల్ కాంప్లెక్స్‌కు నివాస గృహం కింద అనుమతిచ్చిన విషయాన్ని తెలుసుకున్న ఆయన కార్పొరేషన్ రెవెన్యూ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే తిరిగి ‘కమర్షియల్’కు మార్చాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఇప్పటికీ ఆయన ఆదేశాలు మాత్రం అమలు కాలేదు. సదరు భవన యజమాని నుంచి ‘ఆమ్యామ్యాలు’ ముట్టడంతోనే ఎలాంటి చర్యలూ తీసుకోలేదని తెలిసింది.
● తన ఇంటికి ఇతరులు తప్పుడు పత్రాల ద్వారా పన్ను వేయించుకుని, తర్వాత స్వాధీనం చేసుకునేందుకు కుట్ర పన్నారని అనంతపురం నవోదయ కాలనీకి చెందిన వెంకటనారాయణ దంపతులు రెండు రోజుల క్రితం నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామికి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై నగరపాలక సంస్థ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ... నగరపాలక సంస్థ రెవెన్యూ విభాగం ఏ మేర కట్టుతప్పిందో చెప్పేందుకు ఈ రెండు ఘటనలే చాలు.
కట్టుతప్పిన రెవెన్యూ
అనంత నగరపాలక సంస్థ
రెవెన్యూ విభాగంలో ఇష్టారాజ్యం
అక్రమార్జనే పరమావధిగా విధులు
‘పచ్చ’ నేతల ఆదేశాలతో సామాన్యులకు ముప్పుతిప్పలు
ప్రజాప్రతినిధికి నెలనెలా ముడుపులు!
తారస్థాయికి వసూళ్ల పర్వం


