ప్రత్యేక జీవనోపాధి కలే?
అనంతపురం క్రైం: మున్సిపల్ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ప్రత్యేక జీవనోపాధి కల్పించడంలో మెప్మా (మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్) చతికిలపడింది. లక్ష్యాల సాధనలో వెనుకబడిపోతోంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యేక జీవనోపాధి (స్పెషల్ లైవ్లీహుడ్) కింద 277 యూనిట్లు లక్ష్యం నిర్దేశించారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఇంతవరకూ మార్గదర్శకాలే విడుదల చేయలేదు. ఆర్థిక సంవత్సరం మరో రెండు నెలల్లో ముగియనుంది. అయితే అధికారులు 118 యూనిట్లను పూర్తి చేసినట్లుగా పేర్కొంటుండటం గమనార్హం. ఇతర యూనిట్లను స్పెషల్ లైవ్లీహుడ్‌లో చూపించి మమ అనిపిస్తున్నట్లు అర్థమవుతోంది.
లోపించిన సమన్వయం.. స్పష్టత
అధికారుల్లో సమన్వయ లోపం, క్షేత్రస్థాయి పర్యవేక్షణలో నిర్లక్ష్యం, ప్రాజెక్టుల ఎంపికలో స్పష్టత లేకపోవడం వల్లే లక్ష్య సాధనలో వెనుకబడటానికి కార ప్రధాన తప్పిదాలుగా కనిపిస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల సామర్థ్యాన్ని అంచనా వేయకుండా, ఒకే విధమైన ప్రాజెక్టులను ప్రతిచోటా అమలు చేయాలనే ప్రయత్నం బెడిసికొట్టినట్టు తెలుస్తోంది. మార్కెట్ అవసరాలకు సరిపోని యూనిట్లు, సరైన శిక్షణ లేకుండా ప్రారంభించిన ప్రాజెక్టులు కొద్ది కాలంలోనే నిలిచిపోయిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. యూనిట్లు మంజూరైనా.. బ్యాంకు లింకేజీ రుణాలు సక్రమంగా లేకపోవడం, సబ్సిడీ విడుదలలో ఆలస్యం కావడం వల్ల లబ్ధిదారుల్లో నిరుత్సాహం పెరిగింది.
అవసరాలకు అనుగుణంగా చేపడితేనే..
మునిసిపల్ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కోసం పనిచేసే మెప్మా ఆధ్వర్యంలో జిల్లాలోని అనంతపురం నగరపాలక సంస్థతో పాటు తాడిపత్రి, రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుత్తి, గుంతకల్లు మున్సిపాలిటీలకు స్పెషల్ లైవ్లీహుడ్ కింద 277 యూనిట్లు మంజూరు చేసింది. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు ఈ యూనిట్ల ఏర్పాటు ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించాలనేది దీని ఉద్దేశం. అయితే సంప్రదాయ చిరు వ్యాపారాలకే పరిమితం చేయకుండా పట్టణ అవసరాలకు అనుగుణంగా సేవా రంగం, రీసైక్లింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, డిజిటల్ సేవలు వంటి రంగాల వైపు విస్తరించాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రాజెక్ట్ ఎంపికలో మార్కెట్ అధ్యయనం తప్పనిసరిగా చేయాలి. అలాగే, జిల్లా–మున్సిపల్ స్థాయిలో ప్రత్యేక టాస్క్ టీమ్‌లు ఏర్పాటు చేసి, ప్రాజెక్టుల పురోగతిని నెలనెలా సమీక్షించాల్సిన అవసరం ఉంది. అప్పుడే మెప్మా స్పెషల్ ప్రాజెక్టులు లక్ష్యాలకు మాత్రమే కాదు, పట్టణ పేదల జీవితాల్లో నిజమైన మార్పునకు దోహదపడతాయి.
తృప్తి క్యాంటీన్ నమూనా
లక్ష్యసాధనలో ‘మెప్మా’ చతికిల
విడుదల కాని మార్గదర్శకాలు
ప్రత్యేక యూనిట్లపై స్పష్టత కరువు
మరో రెండు నెలల్లో ముగియనున్న గడువు


