
రేపు కలెక్టరేట్‌లో ‘పరిష్కార వేదిక’
● ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ
అనంతపురం అర్బన్: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని ఈనెల 11న కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రెవెన్యూ భవన్‌లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. అర్జీతో పాటు ఫోన్, ఆధార్ నంబర్లు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. గతంలో అర్జీ ఇచ్చి ఉంటే దానికి సంబంధించి రసీదు తీసుకురావాలన్నారు. సమర్పించిన అర్జీల స్థితి గురించి కాల్‌సెంటర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. సమస్యల పరిష్కారం కోసం అర్జీలను ‘పరిష్కార వేదిక’లోనే కాకుండా meekosam. ap.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లోనూ సమర్పించవచ్చని తెలియజేశారు.
పీఏబీఆర్‌లో
పెరుగుతున్న నీటి మట్టం
కూడేరు: పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్)లో నీటి మట్టం పెరుగు తోంది. జీడిపల్లి జలాశయం నుంచి హంద్రీ – నీవా కాలువ ద్వారా కృష్ణా జలాలను పీఏబీఆర్‌కు ఈ నెల ఒకటో తేదీ నుంచి మళ్లించారు. రోజూ 1,650 క్యూసెక్కులు, హెచ్‌ఎల్‌సీ ద్వారా కూడా డ్యాంలోకి 80 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శనివారం నాటికి డ్యాంలో 2.75 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. హెచ్‌హెన్‌ఎస్‌ఎస్, హెచ్చెల్సీ ద్వారా వచ్చే నీటిని డీఈ వెంకట రమణప్ప, జేఈఈలు లక్ష్మీదేవి ముత్యాలప్ప, గంగమ్మ, రేణుక పర్యవేక్షిస్తున్నారు.
జిల్లా అంతటా వర్షం
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు జిల్లా అంతటా మోస్తరు నుంచి భారీ వర్షం కురి సింది. ఒకే రోజు 39.2 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. వజ్రకరూరు మండలంలో 86.2 మి.మీ, ఆత్మకూరు 70.4, శెట్టూరు 68.4, బెళుగుప్ప 65.4, విడపనకల్లు 61.4, తాడిపత్రి మండలంలో 61.4 మి.మీ భారీ వర్షం కురిసింది. అలాగే గుమ్మఘట్ట 58.2 మి.మీ, బ్రహ్మసముద్రం 58.2, పెద్దవడుగూరు 52.4, యల్లనూరు 49.8, యాడికి 48.4, గార్లదిన్నె 46.4, కంబదూరు 45.4, ఉరవకొండ 45.2, రాయదుర్గం 43.2, కుందుర్పి 39.6, కళ్యాణదుర్గం 39, అనంతపురం 32.4, గుంతకల్లు 30.2, శింగనమల 28.4, పామిడి 25.2, కణేకల్లు, రాప్తాడు 21, డి.హీరేహాళ్, బుక్కరాయసముద్రం 20.2 మి.మీ వర్షపాతం నమోదైంది. మిగతా మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. ఆగస్టు సాధారణ వర్షపాతం 83.8 మి.మీ కాగా ఇప్పటికే 91.2 మి.మీ నమోదైంది. రాగల రెండు రోజులూ జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

రేపు కలెక్టరేట్‌లో ‘పరిష్కార వేదిక’