
‘పీ–4’ నిర్బంధం చేస్తే బహిష్కరిస్తాం : యూటీఎఫ్
అనంతపురం ఎడ్యుకేషన్: పీ–4 (జీరో పావర్టీ) కార్యక్రమంలో భాగంగా విద్యార్ధి కుటుంబాలను ఉపాధ్యాయులు తప్పనిసరిగా దత్తత తీసుకోవాలంటూ విద్యాశాఖ అధికారులు నిర్బంధం చేయడాన్ని యూటీఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆ శాఖ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోవిందరాజులు, లింగమయ్య, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడు రమణయ్య తెలిపారు. ఈ మేరకు మంగళవారం డీఈఓ ప్రసాద్‌బాబును కలిసి వినతిపత్రం అందజేసి, మాట్లాడారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన పేరుతో సీఎం చంద్రబాబు ప్రారంభించిన పీ–4 కార్యక్రమంలో సంపన్నులు ముందుకు వచ్చి పేద కుటుంబాలను దత్తత తీసుకోవాలనే నిబంధన ఉందన్నారు. అయితే ఈ కార్యక్రమానికి సంపన్న వర్గాల నుంచి స్పందన రాకపోవడంతో ఆ భారాన్ని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులపై నెట్టడం సరికాదన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఉన్నతాధికారులు ముందుగా పేద కుటుంబాలను దత్తత తీసుకుని ఆదర్శంగా నిలవాలన్నారు. కానీ, ఇప్పటి వరకూ ఏ ఒక్కరూ ఒక్క కుటుంబాన్ని దత్తత తీసుకున్న దాఖలాలు లేవన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు మాత్రం పేద కుటుంబాలను దత్తత తీసుకోవాలని ప్రభుత్వం నిర్బంధించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఉపాధ్యాయులపై నిర్బంధం చేస్తే పీ–4 కార్యక్రమాన్ని బహిష్కరిస్తామని హెచ్చరించారు. డీఈఓను కలిసిన వారిలో యూటీఎఫ్ నాయకులు సుబ్బరాయుడు, చంద్రమోహన్, కోటేశ్వరప్ప, శ్రీనివాసులు, ముసలప్ప, పవన్ కుమార్, డీకే నారాయణ, రమేష్ ఉన్నారు.
‘ఫోరం’లో సీనియర్
టీచర్లకు ప్రాధాన్యతనివ్వాలి
● స్కూల్ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్
అనంతపురం ఎడ్యుకేషన్: మండల అకడమిక్ మానిటరింగ్ ఫోరం సభ్యులుగా సీనియర్ టీచర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (ఏపీ ఎస్టీఏ) శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారుతీప్రసాద్, జయకృష్ణ, వర్కింగ్, అసోసియేట్ ప్రెసిడెంట్స్ నరేష్‌కుమార్, మక్కిశెట్టి కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయుల ఎంపికలో కొందరు ఎంఈఓల తీరును వారు ఆక్షేపించారు. సీనియర్లను విస్మరించి ఇష్టారాజ్యంగా తమకు నచ్చినవారిని, అనుకూలమైన వారిని మండల అకడమిక్ ఫోరం కమిటీలోకి తీసుకోవడంపై అసహనం వ్యక్తం చేశారు. సీనియర్ ఉపాధ్యాయులతో చర్చించకుండా ఉపాధ్యాయుల పేర్లు పంపడం సరైంది కాదన్నారు. మండలాల్లో ఉపాధ్యాయ సంఘాల నాయకులు, సీనియర్ ఉపాధ్యాయుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని మండల అకడమిక్ ఫోరం సభ్యులను నియమించాలని డిమాండ్ చేశారు.