
దంపతుల మృతి కేసులో వీడిన మిస్టరీ
బొమ్మనహాళ్: దంపతుల అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. మనస్పర్థల కారణంగానే వారు ఆత్మహత్య చేసుకున్నట్లుగా నిర్ధారించారు. వివరాలను మంగళవారం రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ, బొమ్మనహాళ్ పీఎస్ ఎస్‌ఐ నబీరసూల్ వెల్లడించారు. కర్ణాటకలోని హోస్పేట్‌కు చెందిన దంపతులు సోమవారం బొమ్మనహాళ్ మండలం నేమకల్లులో ఉరి వేసుకున్న స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఘటనపై అనుమానాలు వ్యక్తం కావడంతో ఆ దిశగా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ముమ్మరం చేశారు. హోస్పేట్ తాలూకా నాగేనహళ్లి గ్రామానికి చెందిన ఆఫ్రీనా (21), హోస్పేట పట్టణానికి చెందిన రహమాన్ (25) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇరు కుటుంబాలను పెద్దలను ఒప్పించి 8 నెలల క్రితం పెద్దల సమక్షంలోనే పెళ్లి చేసుకున్నారు. పెయింటింగ్ పనులతో రహమాన్ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో 4 నెలల క్రితం నేమకల్లు గ్రామంలోని ఆర్య వైశ్య కాంప్లెక్స్‌లో 21వ నంబర్ గదిని అద్దెకు తీసుకు ఆఫ్రీనా సోదరుడు షాబాషాతో కలసి ఉంటూ స్థానికంగా పెయింటింగ్ పనులో చేస్తున్నాడు. అయితే కొన్ని రోజులుగా రహమాన్ తాగుడుకు బానిస కావడంతో భార్య సర్దిచెబుతూ వచ్చింది. తాగుడు వల్ల కలిగే అనర్థాలను వివరించి, మద్యానికి బానిస కావొద్దని నచ్చచెబుతూ వచ్చింది. అయినా రహమాన్‌లో మార్పు రాలేదు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. వారం రోజుల క్రితం ఆఫ్రీనా తన సోదరుడితో కలసి స్వగ్రామానికి వెళ్లి, సోమవారం తిరిగి వచ్చింది. ఆ సమయంలో దంపతులిద్దరి మధ్య గొడవ చోటుచేసుకుని రాజీ పడలేక ఇద్దరూ కలసి దుప్పట్టతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని బళ్లారిలోని విమ్స్‌లో పోస్టుమార్టం నిర్వహించి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
పైళ్లెన 8 నెలలకే మనస్పర్థలు
రాజీ పడలేక ఇద్దరూ ఉరి వేసుకుని ఆత్మహత్య