
ధనదాహం.. దౌర్జన్యం
ఉమ్మడి అనంతపురం జిల్లాలో కంపెనీలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ససేమిరా అంటున్నారు. కూటమి నేతల దెబ్బకు ఒక్క కొత్త కంపెనీ కూడా రాని దుస్థితి నెలకొంది. ఇటీవల గ్రీన్‌టెక్ రీమిక్స్ కంపెనీ ప్రతినిధులపై మంత్రి సవిత అనుచరులు బెదిరింపులకు దిగిన విషయం మరచిపోకముందే.. తాజాగా ‘కియా’ కార్ల పరిశ్రమల్లో కాంట్రాక్టుల కోసం మంత్రి అనుచరులు రభస చేయడం జిల్లాలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. చిన్న పరిశ్రమ స్థాపనకు రేకుల షెడ్డు వేసినా ఎమ్మెల్యేలు వసూళ్లకు తెగబడుతుండడంతో పెట్టుబడిదారులు రావడం లేదు. దీంతో ప్రభుత్వానికి ఆదాయం దారుణంగా పడిపోయింది.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: పరిశ్రమల స్థాపనకు రాష్ట్రంలోనే ఉమ్మడి అనంతపురం జిల్లా అత్యంత అనువైన ప్రాంతంగా పేరుపొందింది. అలాంటి జిల్లాలో పరిశ్రమలు స్థాపించి ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన కూటమి సర్కారు ఆ విషయాన్ని అసలు పట్టించుకోవడమే లేదు. కూటమి సర్కారు వచ్చి 13 మాసాలు దాటినా శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో ఒక్కటంటే ఒక్క చిన్న పరిశ్రమ కూడా ఏర్పాటు కాకపోవడమే ఇందుకు నిదర్శనం.
గ్రీన్‌టెక్ రీమిక్స్ కంపెనీకి బెదిరింపులు..
కూటమి ప్రజాప్రతినిధుల ముడుపుల దాహానికి పారిశ్రామికవేత్తలు బెంబేలెత్తుతున్నారు. రూ.10 లక్షల పెట్టుబడి పెట్టేందుకు కూడా వెనుకడుగు వేస్తున్న దుస్థితి నెలకొంది. పెనుకొండ నియోజకవర్గంలో కొన్నేళ్లుగా గ్రీన్‌టెక్ రీమిక్స్ కంపెనీ నడుస్తోంది. కూటమి సర్కారు రాగానే ఆ కంపెనీని సొంతం చేసుకోవాలని ఆ ప్రాంత మంత్రి పట్టుబట్టారు. అందుకు ఒప్పుకోక పోవడంతో కంపెనీకి ముడిసరుకు సప్లై కాకుండా ఆపివేయించారు. దీంతో విధిలేక సదరు కంపెనీ ప్రతినిధులు టీడీపీకి చెందిన ఎంపీతో మాట్లాడుకుని ప్లాంటులో 50 శాతం భాగస్వామ్యం ఇచ్చారు. పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన మంత్రే బెదిరింపులకు పాల్పడిన అంశం ఉమ్మడి జిల్లాలో అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
కియాలో దౌర్జన్యకాండ..
డీజిల్, మట్టి దందాలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రికి.. తాజాగా ‘కియా’ పరిశ్రమపై కన్నుపడింది. ‘కియా’లో పలు రకాల కాంట్రాక్టులు థర్డ్ పార్టీకి ఇస్తారు. ఎప్పట్నుంచో ఇది నడుస్తున్నదే. కియా చుట్టూ పలు అనుబంధ పరిశ్రమలూ వచ్చాయి. అయితే కియాలో కాంట్రాక్టులన్నీ తమకే కావాలని మంత్రి సవిత అనుచరులు రెండు రోజుల క్రితం దౌర్జన్యానికి దిగారు. మంత్రి అనుచరులు వందల మంది రావడంతో కియా కంపెనీ ప్రతినిధులు ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కియా తన మానస పుత్రిక అని చెప్పుకునే చంద్రబాబు.. తన కేబినెట్‌లోని మంత్రే బెదిరిస్తుండటాన్ని నిలువరించలేకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.
భూమి పూజ రోజు నుంచే..
ఏదైనా పరిశ్రమ పెడదామని ఎవరైనా భూమి పూజ చేస్తే ఆ రోజునుంచే ఎంత ఇస్తారు, ఇవ్వకపోతే పరిశ్రమలు నడుపుకోలేరు అంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి అనుచరులు దౌర్జన్యం చేస్తున్న పరిస్థితి. చివరకు బెంగళూరు–హైదరాబాద్ జాతీయ రహదారిలో ఉన్న ధాబాలు, హోటళ్లను సైతం నేతలు వదలడం లేదు. నెలనెలా మామూళ్లు ఇవ్వకపోతే ఇక మీ ఇష్టం అంటూ బెదిరిస్తున్నారు. సర్కస్ కంపెనీలు నడవాలన్నా ముడుపులు డిమాండ్ చేస్తున్న దుస్థితి నెలకొంది. ఈ క్రమంలో కొత్తగా పరిశ్రమలు పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో కొత్త ఉద్యోగాలు రాకపోగా, ఉన్న ఉద్యోగాలూ పోతున్న దుస్థితి నెలకొంది.
అక్రమార్జనకు ‘తమ్ముళ్ల’ అర్రులు
చెప్పినట్లు వినకుంటే దౌర్జన్యాలు
ఇప్పటికే తారస్థాయికి
ప్రజాప్రతినిధుల దందాలు
భయభ్రాంతులకు గురవుతున్న పారిశ్రామికవేత్తలు
కూటమి సర్కారు వచ్చాక ఒక్క
కొత్త పరిశ్రమా ఏర్పాటు కాని వైనం

ధనదాహం.. దౌర్జన్యం