
పరామర్శకు వెళ్తే కేసులు పెట్టారు..
‘అమ్మా’ అనే పిలుపులేకుండా చేశారు
రాప్తాడురూరల్: అధికారం కోసం చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ గాలిమాటలుగా మారాయని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు.‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ’ కార్యక్రమంలో భాగంగా బుధవారం అనంతపురం నగర శివారు టీవీ టవర్ సమీపంలో ఎస్‌జేఆర్ ఫంక్షన్ హాలులో రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. రాప్తాడు వైస్ ఎంపీపీ రామాంజనేయులు అధ్యక్షతన జరిగిన సమావేశానికి మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్‌పర్సన్ గిరిజమ్మ, నాయకులు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి, పార్టీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రరెడ్డి, బుక్కచెర్ల నల్లపరెడ్డి తదితరులు హాజరయ్యారు. సమావేశానికి రాప్తాడు నియోజకవర్గ నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ అధికారం కోసం చెప్పిన హామీలు చెప్పకుండా కొత్త హామీలతో మోసం చేయడం చంద్రబాబు నైజం అన్నారు. తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్ల అమలులో అతుకులు బొతుకులే ఉన్నాయన్నారు. కొత్త ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, రైతు భరోసా, ఉచిత బస్సు ప్రయాణం, 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1,500 పథకాలు తుస్సుమన్నాయన్నారు. ఏడాదిలో రూ. 1.80 లక్షల కోట్లు అప్పులు తేవడమే బాబు సృష్టించిన సంపద అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కట్టుకథలన్నీ ప్రజలకు అర్థమయ్యాయన్నారు. ప్రజలు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయన్నారు. పాడి మహిళా రైతుల కోసమే తన సొంత నిధులతో ‘అమ్మా’ డెయిరీని ఏర్పాటు చేశానన్నారు. డెయిరీ నిర్వహణకు ఇబ్బందులు కల్గించారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం చొరవ చూపిస్తే అమూల్ డెయిరీకి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ప్రకటించారు.
దేవర దున్నపోతుల్లా వదిలారు..
రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లో అక్రమ వసూళ్లకు పరిటాల కుటుంబ సభ్యులు, బంధువులను దేవర దున్నపోతుల్లా వదిలారని ప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు. పరిటాల కుటుంబం కోసం కేసుల్లో ఇరుక్కున్న బీసీ,ఎస్సీ,ఎస్టీల గురించి ఏమాత్రమూ పట్టించుకోవడం లేదన్నారు. పరిటాల సునీత కుమారులు, సోదరులు వసూల్ రాజాల అవతారం ఎత్తారన్నారు. అనంతపురం రూరల్,ధర్మవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకున్నా పరిటాల కుటుంబానికి కప్పం కట్టాలంట... ఇదేమైనా వాళ్ల నాయన గంటా అని మండిపడ్డారు. కక్కలపల్లి టమాట మండీలో ‘పరిటాల శ్రీరామ్ ట్యాక్స్’ విధిస్తున్నారని, ఒక్కో బండికి రూ. 2,500 వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటిదాకా పరిటాల కుటుంబం రూ. 30 కోట్లు వసూలు చేసిందన్నారు. వీరి దురాగతాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. ఇలాంటి కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో సాగుతున్న రౌడీ రాజ్యాంగాన్ని అంతమొందించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. అనంతరం ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ క్యూఆర్ కోడ్‌లు విడుదల చేశారు.
రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో క్యూఆర్ కోడ్‌లను ఆవిష్కరిస్తున్న మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, చిత్రంలో జెడ్పీ చైర్‌పర్సన్ గిరిజమ్మ, ఎమ్మెల్సీ మంగమ్మ, పార్టీ నేతలు,సమావేశానికి హాజరైన నాయకులు
మోసం చేయడం ఆయన నైజం
రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లో తారస్థాయికి ‘పరిటాల’ దందాలు
అక్రమ కేసులకు భయపడేది లేదు
రౌడీ రాజ్యాంగాన్ని అంతమొందించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి
మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
‘రామగిరి మండలంలో ఒక దళిత బాలికను టీడీపీ గూండాలు గ్యాంగ్‌రేప్ చేశారు. ఈ విషయంపై నిరసన తెలియజేసేందుకు వెళ్తుంటే అరెస్ట్‌లు చేశారు. అక్రమ కేసులు పెట్టారు. ఎస్సీ నాయకులపై కూడా కేసులు బనాయించారు. మహిళలను మానభంగం చేస్తే ప్రశ్నించకూడదా? ఇటీవల అరవిందరెడ్డి అనే టీడీపీ కార్యకర్త ధర్మవరంలో ప్రెస్‌మీట్ పెట్టి పరిటాల రవీంద్ర వందమంది రెడ్లను హత్య చేయించాడన్నందుకు పరిటాల శ్రీరామ్ గూండాలు అతడి కాళ్లు, చేతులు విరగ్గొట్టారు. ఇది రెడ్‌బుక్ రాజ్యాంగం కాదా? పరిటాల శ్రీరామ్ ధర్మవరంలో తనకు ఎదురులేదనుకుంటున్నాడు. ధర్మవరం చరిత్రలో చేనేతల జోలికి ఎవరూ వెళ్లలేదు, కానీ శ్రీరామ్ వారినుంచి కూడా బలవంతంగా డబ్బు వసూలు చేస్తున్నాడు. ఆస్తులు కూడా లాక్కుంటున్నాడు’ అని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు.
అక్రమంగా తమ భూమిని కాజేసేందుకని తనకు ‘అమ్మా’ అనే పిలుపులేకుండా చేశారని రాప్తాడులో ఇటీవల టీడీపీ నాయకుల చేతుల్లో హత్యకు గురైన చిగిచెర్ల నారాయణరెడ్డి, చిగిచెర్ల ముత్యాలమ్మల కుమారుడు ప్రదీప్‌కుమార్‌రెడ్డి కన్నీటి పర్యంతమయ్యాడు. పరిటాల సునీత, ధర్మవరపు మురళీ అండతోనే హత్యకు పాల్పడ్డారని, తన కళ్లముందే కొడవళ్లు, కట్టెలతో తన తల్లిదండ్రులపై దాడి చేశారని వాపోయాడు. టీడీపీ నాయకులు కనికరం లేకుండా తనకు అమ్మా అనే పిలుపులేకుండా చేశారని, తమ బాధ ఎవరికి చెప్పుకోవాలని కన్నీళ్లు పెట్టుకున్నాడు. హత్య కేసులోని ముగ్గురు నిందితులు ఇప్పటికీ బయటే తిరుగుతున్నారని, నిందితుల ఇళ్లకు పరిటాల సునీత, మురళీ తదితరులు వెళ్లిపరామర్శించి వచ్చారని చెప్పాడు. ఇంకోవైపు తన తండ్రి టీడీపీ నాయకుడంటూ ప్రచారం చేసి రాజకీయం చేయాలని చూశారని, మరి వారు మమ్మల్ని ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించాడు. ‘ప్రకాష్‌రెడ్డి మా కుటుంబానికి అండగా నిలిచారు. మా కుటుంబం చచ్చేదాకా వైఎస్సార్‌సీపీతోనే ఉంటుంది’ అని స్పష్టం చేశాడు.