
ఐదు మండలాల్లో బయోగ్యాస్ ప్లాంట్లు
అనంతపురం అర్బన్: జిల్లాలో కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. రీ–సర్వే, చుక్కల భూముల, పీజీఆర్‌ఎస్, పౌర సరఫరాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయాలని చెప్పారు. రెవెన్యూ సెక్టార్, పౌర సరఫరాలు, తదితర అంశాలపై బుధవారం కలెక్టరేట్ నుంచి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్‌డీఓలు, డీఎస్‌ఓ, తహసీల్దార్లు, ఆర్‌ఎస్‌డీటీలు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గుంత కల్లు, పుట్లూరు, కుందుర్పి, యల్లనూరు, కూడేరు మండలాల్లో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయన్నారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి బయోగ్యాస్ ఉత్పత్తికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రకియకు సోలార్ ప్రవర్ ప్రాజెక్టుల అధికారులు సహకరించాలన్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి రేషన్ పంపిణీ సక్రమంగా జరగాలన్నారు. చౌక ధరల దుకాణాలను తహసీల్దార్లు, సీఎస్‌డీటీలు, ఎంఎల్‌ఎస్ పాయింట్లను ఆర్డీఓలు తనిఖీ చేయాలని ఆదేశించారు. రీ–సర్వే, రైల్వే, నెడ్‌క్యాప్ ప్రాజెక్టులకు సంబంధించిన పనులు వేగవంతం చేయాలన్నారు. కాన్ఫరెన్స్‌లో డీఆర్‌ఓ ఎ.మలోల, డీఎస్‌ఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
పింఛన్ల పంపిణీకి సిద్ధంకండి
ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఆగస్టు 1 నుంచి పింఛన్ల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సంబంధిత అధికారులను ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్‌నారాయణ్ శర్మ ఆదేశించారు. పింఛన్ల పంపిణీ అంశంపై బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో ఆయన వీడియోకాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. జిల్లాలో 2.80 లక్షల మంది పింఛనుదారులకు రూ.124.99 కోట్లు పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. పంపిణీ ప్రక్రియ ఒకటో తేదీ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభించాలని చెప్పారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛను సొమ్ము అందించాలని ఆదేశించారు. పింఛను పంపిణీ తీరుపై ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా ప్రభుత్వం ఫీడ్ బ్యాక్ తీసుకుంటుందన్నారు. ఏదేని కారణం చేత పింఛన్లు పంపిణీ కాకపోతే వాటి సొమ్మును రెండు రోజుల్లోగా బ్యాంక్‌లో కట్టాలని ఆదేశించారు. కొత్తగా చేరిన డీడీఓల నమూనా సంతకాలను ఆయా బ్యాంకు ఖాతాల్లో నవీకరించాలని ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లను ఆదేశించారు. కాన్ఫరెన్స్‌లో డీఆర్‌డీఏ పీడీ శైలజ తదితరులు పాల్గొన్నారు.