
భద్రతా నియమాలను పాటించాలి : డీఆర్‌ఎం
గుంతకల్లు: భద్రతా నియమాలను కచ్చితంగా పాటిస్తూ రైలు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని డీఆర్‌ఎం చంద్రశేఖర్‌గుప్తా ఆదేశించారు. బుధవారం స్థానిక డివిజనల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లతో ఆయన సమావేశమై మాట్లాడారు. ప్రస్తుత వర్షాకాలంలో అండర్ బ్రిడ్జిలలో నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. లెవెల్ క్రాసింగ్ గేట్ల వద్ద పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. సురక్షితం కాని ట్రాక్‌లు, వంతెనలు, భారీ వర్షాలు కురిసే ప్రదేశాల్లో తప్పనిసరిగా పెట్రోలింగ్ చేపట్టాలన్నారు. ఇటీవల తిరుపతి రైల్వేస్టేషన్ ఔటర్‌లో జరిగిన అగ్ని ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని పొగను గుర్తించే పరికరాలు, అగ్నిమాపక యంత్రాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ డీఓఎం డాక్టర్ శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు.