
విత్తన లోపమా! ప్రకృతి శాపమా?
పెద్దపప్పూరు: విత్తన లోపమో.. ప్రకృతి శాపమో తెలియదు కానీ, కళింగర సాగు చేసి 47 రోజులవుతున్నా పంట ఎదుగుదల లేక పిందె ధశ లోనే ఉండిపోయింది. వివరాలు.. పెద్దపప్పూరు మండలం పసలూరు గ్రామానికి చెందిన రైతు మద్దా ప్రసాద్ తనకున్న 8 ఎకరాల భూమిలోని 3 ఎకరాల్లో గత నెల 13న కళింగర పంట సాగు చేశాడు. ఇటీవల మరో మూడు ఎకరాల్లో అదే పంటను సాగు చేశాడు. సాధారణంగా విత్తనం వేసిన 60 రోజులకు పంట కోతకు వస్తుంది. ప్రస్తుతం 47 రోజులవుతున్న తొలి దశలో విత్తనమేసిన కళింగర పంట ఎలాంటి ఎదుగుదల లేదు. ఎన్ని మందులు పిచికారీ చేసినా ఫలితం లేకపోయింది. పిందే దశలోనే మగ్గిపోతోంది. దీంతో సదరు రైతు విత్తన కంపెనీ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినా వారి నుంచి స్పందన లేదు. క్షేత్ర స్థాయిలో పండ్ల తోటలను పరిశీలించి సలహాలు సూచనలు ఇవ్వాల్సిన అధికారులు అటుగా దృష్టి సారించకపోవడంతో మండలంలోని ఎంతో మంది రైతులు నష్టపోతున్నారు. పంట కోసం ఇప్పటి వరకూ రూ. 2 లక్షలకు పైగా అప్పు చేసి ఖర్చు పెట్టానని, పంటలో ఎలాంటి ఎదుగుదల లేకపోవడంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదని, తనను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత రైతు మద్దా ప్రసాద్ వేడుకుంటున్నాడు.
సాగు చేసి 45 రోజులవుతున్నా పిందె దశలోనే కళింగర పంట
ఆదుకోవాలని వేడుకుంటున్న రైతన్న
నివేదిక పంపుతాం
కళింగర సాగు చేసి 43 రోజులవుతున్నా పంటలో ఎదుగుదల లేదని, పిందె పిడికెడు సైజులోనే మగ్గిపోతోందని ఫోన్ ద్వారా రైతు మద్దా ప్రసాద్ సమాచారం అందించారు. దీనిపై వ్యవసాయ శాఖ అధికారులను సమన్వయం చేసుకుని క్షేత్రస్థాయిలో పంటను పరిశీలించి, లోపం ఎక్కడుందో గుర్తించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తాం.
– ఉమాదేవి, హెచ్‌ఓ, తాడిపత్రి

విత్తన లోపమా! ప్రకృతి శాపమా?