
పీడిస్తున్న యూరియా కొరత
గుమ్మఘట్ట: జిల్లా రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. సీజన్ ప్రారంభంలోనే పంటల సాగు విస్తీర్ణాన్ని అంచనా వేసి రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాల్సిన ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకోలేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అంచనా వేయలేకపోయిన అధికారులు
ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా వేలాది హెక్టార్లలో రైతులు మొక్కజొన్న, వేరుశనగ, కంది, ఆముదం, వరి, పత్తి పంటలు సాగు చేశారు. ముఖ్యంగా హెచ్చెల్సీ పరిధితో పాటు వ్యవసాయ బోరుబావుల కింద మొక్కజొన్న, పత్తి, టమాట, మిరప, వరి నాట్లు ఊపందుకున్నాయి. ఈ పంటలకు యూరియా వినియోగం ఎక్కువగానే ఉంటోంది. దీంతో యూరియా కోసం పదిహేను రోజులుగా రైతు సేవా కేంద్రాల చుట్టూ రైతులు తిరుగుతున్నారు. సీజన్ ప్రారంభంలోనే పంట సాగు విస్తీర్ణాన్ని అంచనా వేయడంలో అధికారులు విఫలమవడంతోనే యూరియా కొరత నెలకొన్నట్లుగా తెలుస్తోంది. దీంతో బహిరంగ మార్కెట్‌లో అధిక ధరతో యూరియా కొనుగోలు చేయాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అధిక ధర ఇచ్చేందుకు సిద్ధపడుతున్నా... స్టాకు లేదని వ్యాపారులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై రాయదుర్గం ఏడీఏ పద్మజ మాట్లాడుతూ.. ఫర్టిలైజర్ షాపు నిర్వాహకులు, డీలర్లు స్టాక్ వివరాలను ఆన్‌లైన్‌లో సక్రమంగా నమోదు చేయకపోవడంతో సమస్య ఉత్పన్నమైందన్నారు. దీంతో అంచనా వేయలేకపోయినట్లు వివరించారు. అయితే యూరియా కొరత ఉన్నట్లు ఇప్పటి వరకూ తమ దృష్టికి రాలేదని, సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు
చాలా బాధేస్తోంది
సాగు చేసిన పంటలు ఎదుగుదల లేకుండా పోయాయి. వీటిని చూస్తుంటే చాలా బాధేస్తోంది. పంటల సాగు కోసం వేలాది రూపాయలు అప్పుటు చేసి పెట్టుబడి పెట్టాం. సకాలంలో యూరియా అందించకపోతే మొక్క ఎదుగుదల లేక దిగుబడులు చేతికి అందే పరిస్థితి ఉండదు. రోజూ రైతు సేవా కేంద్రాలు, ఫర్టిలైజర్ దుకాణాల వద్దకెళ్లి అడిగితే యూరియా లేదని అంటున్నారు.
– రైతు జంగలి ఎర్రిస్వామి,
బేలోడు గ్రామం, గుమ్మఘట్ట మండలం
బాధ్యత మరిచారు
రైతుల అవసరాలపై పాలకులు, అధికారులు ముందస్తుగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలి. అయితే ఈ విషయంలో వారు బాధ్యత మరిచారు. ఫలితంగా రైతులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. సమస్యకు పరిష్కారం చూపకపోతే పోరాటానికి సిద్ధమవుతాం.
– మెట్టు గోవిందరెడ్డి, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ
సమన్వయకర్త, రాయదుర్గం
ఇబ్బందుల్లో అన్నదాతలు
పట్టించుకోని పాలకులు
అప్పుల పాలవుతాం
రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని యూరియా కొరత లేకుండా చూడాలి. పంటల సాగు కోసం ఇప్పటికే వేలాది రూపాలను అప్పు చేసి పెట్టుబడి పెట్టాం. మొక్క ఎదుగుదలకు యూరియానే ముఖ్యం. సకాలంలో పంటలకు యూరియా అందిస్తే దిగుబడి కాస్తోకూస్తో చేతికి వస్తుంది. లేకుంటే అప్పులే మిగులుతాయి.
– రైతు రామాంజనేయులు,
గోనబావి గ్రామం, గుమ్మఘట్ట మండలం

పీడిస్తున్న యూరియా కొరత

పీడిస్తున్న యూరియా కొరత

పీడిస్తున్న యూరియా కొరత