
గుక్కెడు నీటి కోసం పది రోజులుగా నిరీక్షణ
రాయదుర్గం టౌన్: ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఇలాకాలో తాగునీటి కష్టాలు తారస్థాయికి చేరుకున్నాయి. పది రోజులుగా రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలో తాగునీరు అందక ప్రజలు సతమతమవుతున్నారు. కరెంటు సమస్య, మోటార్ల మరమ్మతు కారణమంటూ అధికారులు బుకాయిస్తూ నీటి సరఫరాలో తీవ్ర జాప్యం వహిస్తుండడంతో మంగళవారం పట్టణంలోని మొలకాల్మూరు రోడ్డులో రెండు చోట్ల, మారెమ్మగుడి ఏరియాలో ఒకచోట ప్రధాన రహదారులపై మూడు చోట్ల స్థానిక మహిళలు ఖాళీ బిందెలతో బైఠాయించి నిరసన తెలిపారు. తమ కాలనీలకు దాదాపు పది రోజులు కావస్తున్నా కొళాయిల ద్వారా తాగునీరు అందక ఇబ్బంది పడుతున్నామని వాపోయారు. కనీస అవసరాలకు సైతం నీరు లేక లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ ఏఈ నరసింహులు, ఫిట్టర్లు అక్కడికి చేరుకుని మహిళలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఆందోళన కారులు వినకపోవడంతో చివరకు అవసరమైన ప్రాంతాలకు వాటర్ ట్యాంకుల ద్వారా తాగునీటి సరఫరా చేస్తామని భరోసానిచ్చి, ఆందోళనను విరమింపజేశారు. రెండురోజుల్లోగా కరెంటు సమస్య, మోటారు మరమ్మతులు పూర్తి చేసి కాలనీలకు నీటి సరఫరాను పునరుద్దరిస్తామని హామీ ఇచ్చారు.
దాహార్తి తీర్చాలంటూ రాయదుర్గం రహదారులపై ఖాళీ బిందెలతో మహిళల నిరసన