జిల్లా జడ్జికి ఘన సన్మానం
అనంతపురం: ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీనివాస్ సేవలు ప్రశంసనీయమని ఎస్పీ పి.జగదీష్ కొనియాడారు. బదిలీపై వెళ్తున్న జడ్జి జి.శ్రీనివాస్‌ను మంగళవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ.. న్యాయమూర్తి జి.శ్రీనివాస్ మార్గదర్శకంలో జిల్లా పోలీసు, న్యాయశాఖలు పరస్పర సహకారంతో బాధితులకు న్యాయం చేకూరేలా పనిచేశాయన్నారు. కఠిన నేరాల్లో ముద్దాయిలకు కఠిన శిక్షలు వేయడాన్ని గుర్తు చేసుకున్నారు.
రోడ్డు ప్రమాదంలో
వృద్ధుడి మృతి
పెద్దపప్పూరు: మండలంలోని ముచ్చుకోట అటవీ ప్రాంతంలో మంగళవారం చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... శింగనమల మండలం జలాలపురం గ్రామానికి చెందిన గిరిస్వామి (60) మంగళవారం వ్యక్తిగత పనిపై తాడిపత్రికి వెళ్లాడు. అక్కడ పని ముగించుకుని ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైన ఆయన ముచ్చుకోట అటవీ ప్రాంతంలో ప్రయాణిస్తుండగా ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన గిరిస్వామిని అటుగా వెళుతున్న వారు గుర్తించి వెంటనే అనంతపురంలోని అనంతపురంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్సకు స్పందించక ఆయన మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు.
గుండెపోటుతో విశ్రాంత ఉపాధ్యాయుడి మృతి
యల్లనూరు: మండలంలోని పాతపల్లి గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు వెంకట కొండారెడ్డి(86) సోమవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. మండలంలోని జంగంపల్లి, పాతపల్లి, కాచర్లకుంట తదితర గ్రామాల్లోని పాఠశాలల్లో ఆయన ఉపాధ్యాయుడుగా విధులు నిర్వర్తించారు. వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురంలో స్థిరపడిన ఆయన అకాల మృతితో పలువురు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన అంత్యక్రియలను స్వగ్రామం పాతపల్లిలో నిర్వహించారు.


