
ప్రశాంతంగా జాతర జరుపుకోవాలి
విడపనకల్లు: అల్లర్లకు పాల్పడకుండా, ప్రశాంత వాతావరణంలో జాతర జరుపుకోవాలని కలెక్టర్ వినోద్‌కుమార్ సూచించారు. మండల పరిధిలోని వేల్పుమడుగు గ్రామంలో గురువారం సుంకలమ్మ ముత్యాల పల్లకీ ఊరేగింపు చేసుకుంటామని గ్రామస్తులు ఎస్‌ఐ ఖజాహుస్సేన్, తహసీల్దార్ దస్తగిరయ్యకు రెండు రోజుల క్రితం వినతి పత్రం సమర్పించారు. అయితే ఎన్నికల నేపథ్యంలో ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో కలెక్టర్ బుధవారం వేల్పుమడుగు గ్రామంలో పర్యటించారు. స్థానిక సర్పంచు తిప్పారెడ్డి, రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమయ్యారు. జిల్లాలో పలు చోట్ల పోలింగ్ అనంతరం నెలకొన్న పరిణామాలను వివరించారు. గొడవలకు తావివ్వమంటేనే అనుమతి ఇస్తామన్నారు. అందరం కలసికట్టుగా,సామరస్యంగా జాతర జరుపుకుంటామని గ్రామస్తులు తెలపడంతో అనుమతినిచ్చారు. అనంతరం సుంకలమ్మ ఆలయంలో కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులు ఆయనను సన్మానించారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసులురెడ్డి, గ్రామ పెద్దలు లక్ష్మిరెడ్డి, తిమ్మారెడ్డి, నారాయణరెడ్డి, పెద్దన్న, శ్రీరాములు, మాజీ ఎంపీటీసీ పరమేషప్ప, పాల్గొన్నారు.
రికార్డులు పక్కాగా ఉండాలి
రికార్డులు పక్కాగా ఉండేలా చూసుకోవాలని కలెక్టర్ వినోద్‌కుమార్ అన్నారు. బుధవారం విడపనకల్లు తహసీల్దారు కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో తహసీల్దారు దస్తగిరయ్యపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కార్యాలయంలో రికార్డుల గదిని పరిశీలించారు. రికార్డులు ఎప్పటికప్పుడు అడ్‌డేట్‌గా ఉండేలా చూసుకోవాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. రెవెన్యూ కార్యాలయం నుంచి ఎలాంటి సేవలు అందిస్తున్నామో ప్రజలకు తెలిసేలా సిటిజన్ చార్ట్ ఏర్పాటు చేయాలన్నారు. సీసీఆర్‌సీ కార్డుల మంజూరు కోసం అర్హులైన రైతులను గుర్తించాలని సూచించారు. కార్యాలయానికి వచ్చే ప్రజల సౌకర్యార్థం మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసులరెడ్డి ఉన్నారు.