
కళ్యాణదుర్గం: స్థానిక సెబ్ పరిధిలో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న రూ.13,51,774 విలువైన కర్ణాటక మద్యాన్ని జేసీబీ సాయంతో పోలీసులు మంగళవారం ధ్వంసం చేశారు. ఈ ప్రక్రియను జిల్లా సెబ్ అదనపు ఎస్పీ రామకృష్ణ, సీఐ సోమశేఖర్, పట్టణ సీఐ హరినాథ్, ఎస్‌ఐ సుధాకర్ తదితరులు పరిశీలించారు.
వృద్ధురాలి బలవన్మరణం
ఆత్మకూరు: మండలంలోని మదిగుబ్బ గ్రామానికి చెందిన నరసమ్మ (70 ) చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన మేరకు... శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం బద్దలాపురం గ్రామానికి చెందిన నరసమ్మకు 40 ఏళ్ల క్రితం ఆత్మకూరు మండలం మదిగుబ్బ గ్రామానికి చెందిన నరసింహులుతో వివాహమైంది. పెళ్లి తర్వాత రెండేళ్లు కలిసే ఉన్న వీరు ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో విడిపోయారు. అప్పటి నుంచి నరసమ్మ బద్దలాపురంలోనే నివాసముంటోంది. నాలుగు నెలల క్రితం భర్త నరసింహులు చనిపోవడంతో మదిగుబ్బకు చేరుకుంది. ఈ క్రమంలోనే భర్త ఆలోచనలతో దిగాలు చెందిన ఆమె మంగళవారం ఉదయం గ్రామ శివారులోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు.
జిల్లాకు బదిలీపై
తహసీల్దారు భాస్కర్
అనంతపురం అర్బన్: శ్రీసత్యసాయి జిల్లా నుంచి అనంతపురం జిల్లాకు తహసీల్దారు భాస్కర్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. దీంతో మంగళవారం ఉదయం కలెక్టర్ ఎమ్.గౌతమి వద్ద ఆయన రిపోర్ట్ చేసుకున్నారు. గతంలో ఆయన ఎన్నికల విభాగంలో విధులు నిర్వర్తించిన నేపథ్యంలో కేఆర్‌సీసీ తహసీల్దారుగా లేదా కో–ఆర్డినేషన్ సెక్షన్ సూపరింటెండెంట్‌గా పోస్టింగ్ ఇచ్చి ఎన్నికల విభాగం బాధ్యతలు అప్పగించవచ్చునని అధికారవర్గాల సమాచారం.

ధ్వంసం చేసేందుకు తెచ్చిన మద్యం బాక్స్‌లను పరిశీలిస్తున్న సెబ్ అదనపు ఎస్పీ రామకృష్ణ