ఉత్తుత్తి తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

ఉత్తుత్తి తనిఖీలు

Jan 19 2026 4:29 AM | Updated on Jan 19 2026 4:29 AM

ఉత్తు

ఉత్తుత్తి తనిఖీలు

కళ్యాణదుర్గం: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమాలు వెలుగు చూడకుండా స్థానిక టీడీపీ నేతల కుట్రలకు అధికారులు, సిబ్బంది వత్తాసు పలికారు. ఇందుకు ఏకంగా సామాజిక తనిఖీ బృందాలను లోబర్చుకుని భారీ దోపిడీకి ఎత్తుగడ వేశారు. దీంతో నియోజకవర్గంలో తనిఖీ బృందాల అక్రమాలు నానాటికీ పేట్రేగిపోతున్నాయి. నియోజకవర్గంలో అధికంగా టీడీపీ కార్యకర్తలే ఫీల్డ్‌ అసిస్టెంట్లుగా అవతారమెత్తి అందిన కాడికి దోచిన వైనంపై సాక్ష్యాధారాలతో ‘సాక్షి’లో వరుస కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో 2024–25 ఏడాదికి సంబంధించి కళ్యాణదుర్గం రూరల్‌, కంబదూరు, కుందుర్పి, శెట్టూరు, బ్రహ్మసముద్రం మండలాల్లో రూ.61.86 కోట్లతో పూర్తి చేసిన పనులకు ప్రస్తుతం సామాజిక తనిఖీ జరుగుతోంది.

సామాజిక తనిఖీల పేరుతో

అడ్డగోలు యవ్వారం..

గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో జరిగే అక్రమాలు గుర్తించడంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని సామాజిక తనిఖీ బృందాలది కీలకపాత్ర. పని ప్రాంతంలో లేని కూలీల పేరుతో వేతనాలు కాజేసినా, తప్పుడు హాజరుతో అక్రమాలకు పాల్పడినా, తక్కువ విస్తీర్ణంలో చేసిన పనిని ఎక్కువ విస్తీర్ణంగా చూపి నిధులు నొక్కేసినా ఈ సామాజిక తనిఖీ బృందాలు గుర్తించి తగిన చర్యలకు సిఫారసు చేస్తాయి. అయితే సామాజిక తనిఖీల్లో జవాబుదారీతనం, పారదర్శకత లోపించినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన సామాజిక తనిఖీ బృందాలు ఒక్కో పంచాయతీ పరిధిలో చేసిన పనుల విలువ ఆధారంగా గరిష్టంగా రూ. 2 లక్షల వరకూ ముడుపులు క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి వసూలు చేస్తున్నట్లుగా ఆరోపణలు వినవస్తున్నాయి. దీంతో పనుల్లో లోపాలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. అధికారులకు అనుమానం రాకుండా ఒకటి, రెండు పనుల్లో చిన్నపాటి లోపాలున్నట్లు చూపించి మమ అనిపిస్తున్నారు. తాము కోరిన మేరకు డబ్బు ఇవ్వని ఫీల్డ్‌ అసిస్టెంట్లకు చుక్కలు చూపిస్తున్నారు. కూలీల మస్టర్లలో దిద్దుబాట్లు ఉన్నాయని, తక్కువ పనిని ఎక్కువగా చూపించారంటూ తప్పుడు నివేదికలు రాస్తున్నారు. తప్పనిసరిగా నిర్వహించాల్సిన ఏడు రికార్డులు అందుబాటులో లేవంటూ క్షేత్రస్థాయి సిబ్బందిని ఇబ్బంది పెడుతున్నారు.

ముడుపులతో అవినీతిని

కప్పిపెడుతున్న వైనం..

గతంలో సామాజిక తనిఖీలకు వెళ్లేటప్పుడు క్షేత్రస్థాయి సిబ్బంది భోజనం ఏర్పాటు చేసినా బృందం సభ్యులు తిరస్కరించేవారు. వాళ్లే సొంతంగా వసతి ఏర్పాట్లు చేసుకునేవారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తనిఖీ బృందం సభ్యుల్లో విచ్చలవిడితనం పెరిగిపోయింది. తమకు వసతి, భోజన సదుపాయం కల్పించాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశిస్తున్నారు. పనులను తనిఖీ చేసే ప్రాంతంలోనే బహిరంగంగానే కమీషన్లు దండుకుంటున్నారు. లక్ష రూపాయల విలువైన పనికి రూ.10 వేలు చొప్పున కమీషన్‌ను ఇవ్వాల్సిందేనని ఫీల్డ్‌ అసిస్టెంట్లను డిమాండ్‌ చేస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. సామాజిక తనిఖీ బృందాల బెడద పడలేక ఫీల్డ్‌ అసిస్టెంట్లు తప్పనిసరి పరిస్థితుల్లో వారికి కమీషన్లు ముట్టజెబుతున్నట్లుగా సమాచారం. ఈ సొమ్మును తిరిగి సంపాదించుకునేందుకు ఫీల్డ్‌ అసిస్టెంట్లు సైతం అడ్డ దారులు తొక్కుతున్నారు. ఈ అడ్డగోలు యవ్వారం మొత్తం టీడీపీ నేతల కనుసన్నల్లోనే సాగుతున్నట్లుగా ఉపాధి కూలీలు ఆరోపిస్తున్నారు.

సామాజిక తనిఖీల మాటున దోపిడీ

క్షేత్ర స్థాయి పరిశీలనలకు తిలోదకాలు

ముడుపులతో అవినీతిని

కప్పిపెడుతున్న వైనం

మొక్కుబడి తనిఖీలతో

మమ అనిపిస్తున్న టీడీపీ నేతలు

ఉత్తుత్తి తనిఖీలు 1
1/2

ఉత్తుత్తి తనిఖీలు

ఉత్తుత్తి తనిఖీలు 2
2/2

ఉత్తుత్తి తనిఖీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement