ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 13 మందికి తీవ్ర గాయాలు
నల్లమాడ: మండల పరిధిలోని పులగంపల్లి సమీపాన ఆదివారం సాయంత్రం ఎదురెదురుగా ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన మేరకు.. కదిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో హిందూపురం వెళ్తోంది. మార్గమధ్యంలో పులగంపల్లి దాటిన తరువాత రోడ్డు మలుపులో ఓడీ చెరువు వైపునుంచి కదిరికి వస్తున్న సిమెంట్ లారీ, బస్సు పరస్పరం ఢీకొన్నాయి. ఈ క్రమంలోనే బస్సులో ప్రయాణిస్తున్న 13 మందికి రక్తగాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఎన్‌పీ కుంట మండలం పెడబల్లికి చెందిన కాల్వపల్లి గంగాదేవి, గోరంట్ల మండలం కలిగేరికి చెందిన ఎం. నాగరాజు, నల్లమాడ మండలం ఆదిఆంధ్రపల్లికి చెందిన వీ. ఉమాదేవి, కదిరి కుమ్మరవాండ్లపల్లికి చెందిన కే. వెంకటనారాయణమ్మ, హిందూపురం ప్రశాంతి నగర్‌కు చెందిన ఎం. సాయి సందీప్, ఎం. లక్ష్మి, పందలకుంటకు చెందిన కే. శాంతమ్మ, కే. ముసలరెడ్డి, ఎన్. సాహిత్య, కదిరి శివాలయం వీధికి చెందిన కే.మహమ్మద్, కొండకమర్లకు చెందిన మహబూబ్ బీ, పఠాన్ షబానా, రాయచోటికి చెందిన కే. అయూబ్ ఖాన్, కే. షాహానా ఉన్నారు. ప్రమాదంలో బస్సు ముందు భాగం బాగా దెబ్బతింది. సమాచారం తెలుసుకున్న పులగంపల్లి, కాయలవాండ్లపల్లి, బొగ్గిటివారిపల్లి గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
మానవత్వం చాటుకున్న మక్బూల్..
వైఎస్సార్ సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త మక్బూల్ మానవత్వం చాటుకున్నారు. పులగంపల్లి వద్ద ప్రమాదం జరిగిన సమయంలో అటుగా వెళ్తున్న ఆయన ఘటనా స్థలంలో క్షతగాత్రుల వద్దకు వెళ్లి ధైర్యం చెప్పారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టారు. తక్షణమే 108కు ఫోన్ చేసి క్షతగాత్రులను కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు.
ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 13 మందికి తీవ్ర గాయాలు


