ఆటవెలదులే ఆయుధంగా..
భూమిలోన బుట్టు భూసారమెల్లను
తనువులోన బుట్టు తత్వమెల్ల
శ్రమములోన బుట్టు సర్వంబు తానౌను
విశ్వదాభిరామ ! వినుర వేమ !
.. అంటూ కార్మిక, శ్రామిక గొప్పతనాన్ని, వివరించిన ప్రజాకవి యోగి వేమన.. తనదైన సాహిత్యంలో ఆటవెలదులనే ఆయుధంగా మార్చుకుని అంధ విశ్వాసాలపై సంధించిన అస్త్రాలు నేటికీ బహుళ ప్రాచుర్యంలో నిలిచాయి. అభ్యుదయ భావజాలంతో సాగిన యోగి వేమన సాహిత్యానికి తొలి నుంచి అనంత వాసులు విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో వేమన జయంతిని సోమవారం స్ఫూర్తిదాయకంగా నిర్వహిస్తున్నారు.
అనంతపురం కల్చరల్: వేమన సాహిత్యం ఆద్యంతం విలక్షణంగా సాగింది. మత మౌఢ్యాన్ని ప్రచారం చేసే వారిపై వందల ఏళ్ల క్రితమే విరుచుకుపడి జనంలో చైతన్యం తీసుకువచ్చారు. మధ్యయుగంలో జీవించిన వేమన కేవలం కవిగానే కాకుండా సంస్కరణాభిలాషిగా, కులాలను నిరసించిన మానవతామూర్తిగా, పరభాషా ఆధిపత్యాన్ని ప్రశ్నించిన తిరుగుబాటుదారుడిగా తెలుగువారి గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోయారు.
పరిశోధకులకు దిక్సూచి..
వేమన పద్యాలపై సుప్రసిద్ధ కవి అనంత కృష్ణామాచార్యులు సుదీర్ఘ పరిశోధనలు చేసి ‘వేమన’ గ్రంథాన్ని వెలువరించారు. అదే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది పరిశోధకులకు దిక్సూచిగా నిలిచింది. తెలంగాణకు చెందిన డాక్టర్ పొన్నగంటి హనుమంతరెడ్డి గతంలో అనంతకొచ్చి ఆచార్య తుమ్మపూడి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ‘వేమన కవితా సౌందర్యం’ అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. శ్రీసత్యసాయి జిల్లా కటారుపల్లిలో వేమనకు ఆలయం ఉండగా.. 1980లో నగరంలోని చెరువుకట్టపై వేమన ఆలయం నిర్మించారు. అయితే పాలకుల నిర్లక్ష్యం కారణంగా అది కాస్త శిథిలావస్థకు చేరుకుంది. ఈ క్రమంలో ఆ ఆలయాన్ని వేమన అభిమానులు పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకున్నారు. అనంతపురంలోని టెలీభవన్‌కు ‘వేమన’ పేరు పెట్టుకుని గౌరవాన్ని చాటుకున్నారు.అలాగే టవర్‌క్లాక్ వద్ద గతంలో ఏర్పాటు చేసిన వేమన విగ్రహాన్ని రోడ్డు విస్తరణలో భాగంగా ఆర్ట్స్ కాలేజీ వద్దకు మార్చారు.
పద్య పఠన పోటీలతో చైతన్యం ..
వేమన సాహిత్యమే ప్రచార లక్ష్యంగా చేసుకున్న వేమన ఫౌండేషన్.. 2020లో మాజీ డీజీపీ చెన్నూరు ఆంజనేయరెడ్డి గౌరవాధ్యక్షుడిగా ఏర్పాటైంది. విశ్రాంత ఉపకులపతి డాక్టర్ కాడా రామకృష్ణారెడ్డి అధ్యక్షుడిగా, కేంద్రసాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత డాక్టర్ అప్పిరెడ్డి హరినాథరెడ్డి వ్యవస్థాపక కార్యదర్శిగా వ్యవహరిస్తూ వేమన కోరుకున్న సమసమాజ స్థాపనకు, తెలుగు భాషా పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో వేమనపై అధ్యయనం, విస్తరణ కోసం ప్రత్యేక సంస్థ కావాలని, కటారుపల్లెలో వేమన సమాధి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న డిమాండుతో అనేక కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. ఈ ఏడాది 128 పాఠశాలల్లో పద్య పఠన పోటీలతో వేమన సాహిత్యంపై విద్యార్థుల్లో చైతన్యం తీసుకురానున్నారు.
నేడు జయంతి వేడుకలు..
వేమన జీవిత ప్రచారమే లక్ష్యంగా ఏర్పడిన ‘వేమన రెడ్డి సేవా సంఘం’ ఆధ్వర్యంలో నారాయణరెడ్డి, గోపాలరెడ్డి బృందాలు కొన్నేళ్లుగా పెద్ద స్థాయిలో వేమన జయంతిని నిర్వహిస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం అనంతపురంలోని ఆర్ట్స్ కాలేజీ వద్ద ఉన్న వేమన విగ్రహం వద్ద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. సన్మానాలు, సందేశాలు, నారాయణ సేవ కార్యక్రమాలు ఉంటాయి.
సందర్భం : నేడు యోగి వేమన జయంతి
వేమన పద్యాలకు ‘అనంత’ సాహిత్య సంస్థల బాసట


