పలు చోట్ల దాడులు, ఘర్షణలు
7వ తేదీ ఫలితాలపై అభ్యర్థులు,
రాజకీయ పార్టీలు దృష్టి
కానరాని ఓటర్ స్లిప్పుల పంపిణీ
పోలింగ్ కేంద్రాలను సందర్శించిన
కలెక్టర్, ఎస్పీ, జనరల్ అబ్జర్వర్
రొంగలివానిపాలెంలో ఎన్నికల్ని
బహిష్కరించిన ఓటర్లు
తురకలపూడి, గొడిచర్లలో ఉద్రిక్తత
దేవవరంలో ఓటు వేసేందుకు వచ్చిన శతాదిక వృద్ధురాలు కాసులమ్మ
సాక్షి, అనకాపల్లి : జిల్లాలో పరిషత్ ఎన్నికల సందర్భంగా కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఇటీవల నిర్వహించిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు దీటుగా పార్టీ అభ్యర్థులు విజయం కోసం పోరాడారు. పట్టణ ప్రాంత ఎన్నికల వాతారణానికి భిన్నంగా గ్రామీణ ఎన్నికలు మారాయి. దీంతో ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికలు తోపులాటలు, ఘర్షణలు జరిగే స్థాయికి మారాయి. జీవీఎంసీ ఎన్నికల్లో జరిగిన పోలింగ్ శాతం కంటే పరిషత్ ఎన్నికల్లో అధికంగా నమోదయ్యాయి. గురువారం సాయంత్రం 5 గంటలకు పూర్తి కావాల్సిన పోలింగ్,అప్పటికే కేంద్రాలకు చేరుకున్న ఓటర్లంతా తమ ఓటు హక్కుని వినియోగించుకునేంత వరకూ పోలింగ్ జరిపారు. ఉదయం 7 గంటలకే జిల్లాలోని 24 మండలాల్లో పోలింగ్ సెంటర్ల వద్దకు ఓటర్లు చేరుకున్నారు. 24 మండలాల పరిధిలో 24 జెడ్పీటీసీ స్థానాలకు గానూ 80 మంది బరిలో ఉండగా, 425 ఎంపీటీసీ స్థానాలకు గానూ 979 మంది పోటీ పడ్డారు.
ఎస్పీ తుహీన్ సిన్హా కశింకోట, సబ్బవరం, నక్కపల్లి, ఎస్.రాయవరం మండలాల్లో పర్యటించి ఆయా మండలాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు, పోలింగ్ సరళిని పరిశీలించారు. జిల్లాలోని ఎన్నికల తీరుని జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కలెక్టర్ విజయ్‌కృష్ణన్ పర్యవేక్షించారు. అధికారుల కు సూచనలు చేశారు. అనంతరం కశింకోట మండలంలోని నర్సింగబిల్లి, యలమంచిలి మండలంలోని రేగుపాలెం ఉన్నత పాఠశాల, ఎస్.రాయవరం మండలంలోని ధర్మవరం గ్రామం ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం, నక్కపల్లి మండలంలోని ఉపమాక అగ్రహారంలో గ్రామీణ గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం, పాయకరావుపేట ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలోని పోలింగ్ తీరు, ఏర్పాట్లుపై ఆరా తీశారు. పరిషత్ ఎన్నికల జనరల్ అబ్జర్వర్ రోణంకి గోపాలకృష్ణ గొలుగొండ మండలం ఎర్రవరం, చీడిగుమ్మల, నాతవరం మండలం ఎం.బెన్నవరం, ఎర్రవరం, నర్సీపట్నం మండలం వేములపూడి, దుగ్గడలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు.
పెరిగిన పోలింగ్ శాతం...
జిల్లాలో పరిషత్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు 12,35,090 మంది ఓటు హక్కు కలిగి ఉండగా, కడపటి వార్తలు అందేసరికి 9,23,662 మంది ఓటు వేశారు. ఈ మేరకు పోలింగ్ శాతం 74.78 నమోదయ్యింది.
రొంగలివానిపాలెంలో ఎన్నికల బహిష్కరణ..
జీరో శాతం పోలింగ్...?
అనకాపల్లి మండలంలోని రొంగలివానిపాలెంలో జీరో శాతం పోలింగ్ నమోదయ్యింది. మండలంలోని కుంచంగి సెగ్మెంట్ పరిధిలోని రొంగలివానిపాలెంలో 821 ఓట్లు ఉండగా, ఓటు వేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇటీవల అనకాపల్లి మండలంలోని 26 పంచాయతీలకు రిజర్వేషన్లు వర్తింపజేస్తూ కలెక్టర్ ఇచ్చిన గెజిట్‌ను పక్షం రోజుల వ్యవధిలో అమెండ్‌మెంట్ ఇచ్చి 13 పంచాయతీల రిజర్వేషన్లు మార్చడమే ఈ బహిష్కరణకు కారణం. రొంగలివానిపాలెంలో ఎన్నికల్ని బహిష్కరించినట్లు అధికారులకు తెలియడంతో ఆర్‌డీఓ, డీపీఓ, ఎంపీడీవో, తహసీల్దార్‌లు గ్రామానికి వచ్చి స్థానికులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ గ్రామస్తులు స్పందించలేదు. ఈ విషయంలో ఉన్నతాధికారుల సూచనల మేరకు తదుపరి ఏర్పాట్లు చేయాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. కాగా గ్రామస్తులు బహిష్కరించినప్పటికీ రెండు ఓట్లు పడినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే దీనిని ఎన్నికల అధికారులు ధ్రువీకరించలేదు.
పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు
జిల్లాలో పరిషత్ ఎన్నికలు 1530 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగగా, అనకాపల్లి మండలంలోని రొంగలివానిపాలెంలో ఎన్నికలు నిలిచిపోయాయి. బుచ్చెయ్యపేట మండలంలోని తురకలపూడిలో దొంగ ఓట్లు వేయొద్దని చెప్పిన వైఎస్సార్‌సీపీ పోలింగ్ ఏజెంట్‌పై కూటమి నేతలు దాడి చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. నక్కపల్లి మండలంలోని గొడిచర్ల వద్ద ఓటు వేసేందుకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తని కూటమి నేత అడ్డుకోవడంతో ఇరు వర్గాలు బాహాబాహీకి దిగారు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. పోలింగ్ బూత్ ముందే ఘర్షణ జరగడంతో ఓటర్లు భయాందోళనకు గురయ్యారు. ఇటీవల కురిసిన వర్షాలకు వి.మాడుగుల మండలంలోని ఉరకగెడ్డ పొంగినప్పటికీ తాడివలస గిరిజనులు ఓటు వేసేందుకు ట్రాక్టర్‌పై ఉరకగెడ్డ దాటారు. ప్రమాదమని తెలిసినప్పటికీ గిరిజనులు ఉరకగెడ్డను దాటి ఎన్నికల్లో పాల్గొన్నారు. అచ్యుతాపురం మండలంలోని పునరావాస కాలనీకి వచ్చిన పలువురు ఓటర్లకు తమ ఓటు ఎక్కడ ఉందో తెలియక ఇబ్బందులకు గురయ్యారు.
ఓటర్లకు తిప్పలు...
జిల్లాలోని చాలా చోట్ల ఎన్నికల నిర్వహణకు సంబంధించి లోటుపాట్లు కనిపించాయి. ఓటర్లకు స్లిప్పులు పంచకపోవడంతో ఓటర్లు తమ ఓటు ఏ పోలింగ్ కేంద్రంలో ఉందో తెలియక తికమక పడ్డారు. తటస్థంగా ఎన్నికల సిబ్బంది ద్వారా స్లిప్పులు పొంది ఓటు వేయాల్సిన ఓటర్లు ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద శిబిరాలు ఏర్పాటు చేసుకున్న రాజకీయ పార్టీ నేతల వద్దకు వెళ్లి వారి ఓటు ఎక్కడ ఉందో తెలుసుకోవాల్సి వచ్చింది. తద్వారా ఓటర్లు ప్రలోభాలకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని చోట్ల స్లిప్పులు పంచకపోవడం, మరికొన్ని చోట్ల అరకొరగా పంచడం ద్వారా ఎన్నికల నిర్వహణలో అలసత్వం కనిపించిందని ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.


