మాకవరపాలెం : పాత ఓటరు స్లిప్పుల పంపిణీతో ఓటర్లు గందరగోళానికి గురయ్యారు. మాకవరపాలెం ఎంపీటీసీ సెగ్మెంట్ పరిధిలో ఉన్న నాలుగు పోలింగ్ కేంద్రాల్లో 3,777 మంది ఓటర్లు ఉన్నారు. వీరికి బీఎల్వోలు ముందుగా ఇంటింటికీ వెళ్లి ఓటరు స్లిప్పులు పంపిణీ చేశారు. వీటిని తీసుకుని గురువారం స్థానిక ప్రాథమిక పాఠశాలలో పోలింగ్ కేంద్రాలకు ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చారు. పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బంది వద్ద ఉన్న జాబితాలకు ఓటర్లకు పంపిణీ చేసిన స్లిప్పులకు పొంతన లేకుండా పోయింది. దీంతో ఉదయం 7 నుంచి 8 గంటల వరకు పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది.
దీంతో ఓటర్లు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత స్లిప్పులు పంపిణీ చేయడం ఏమిటని మండిపడ్డారు. చేసేది లేక కొందరు వెనుదిరగగా, మరికొందరు తమ ఓట్లు ఏ కేంద్రాల్లో ఉన్నాయో తెలుసుకునేందుకు పోలింగ్ కేంద్రం బయట శిబిరాల వద్దకు పరుగులు తీశారు.
ఈ ఓటరు స్లిప్పుల గందరగోళంపై ఎంపీటీసీ అభ్యర్థులు మండల పరిషత్ అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించ లేదని ఆరోపించారు. చివరకు సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడంతో విషయం తెలుసుకున్న ఆర్వో అప్పారావునాయుడు, ఏఆర్వో నూకరాజు పోలింగ్ కేంద్రానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి కొత్త జాబితాల్లో ఉన్న ఓటరు స్లిప్పులను పంపిణీ చేయించడంతో పోలింగ్ యధావిధిగా కొనసాగింది.


