నక్కపల్లి/అనకాపల్లి : స్థానిక ఎన్నికల పోలింగ్‌ను గురువారం జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా పరిశీలించారు. నక్కపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో పోలింగ్ సరళిని తెలుసుకున్నారు. జిల్లాలో శాంతియుత వాతావరణంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడం జరిగిందని, స్థానిక ప్రజలు, ఓటర్లు పోలింగ్ బూత్‌ల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బందికి సహకరించడం జరిగిందని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. గురువారం జిల్లాలో పలు మండలాల్లో పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లను పోలింగ్ కేంద్రాలు వద్ద సమస్యలను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల లెక్కింపు కార్యక్రమం ఈనెల 7న జరగనున్న సమయంలో ప్రశాంతమైన వాతావరణంలో లెక్కింపు జరిగేలా ప్రత్యేక పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ ఈ.శ్రీనివాసులు పాల్గొన్నారు.
పోలింగ్ ప్రశాంతం : కలెక్టర్
తుమ్మపాల : జిల్లాలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి విజయకృష్ణన్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పోలింగ్ సరళిని ఆమె పర్యవేక్షిస్తూ, అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు అందజేస్తున్నారు.
కలెక్టర్‌తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ పై పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 24 జెడ్పీటీసీ, 425 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం1530 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించడం జరిగిందని అన్నారు. జిల్లాలో 10,345 మంది సిబ్బందితో ఎన్నికల నిర్వహణ చేపట్టారని, సుమారు 2255 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, 381 అతి సమస్యాత్మక, 465 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో ఎన్నికల ప్రశాంతంగా జరిగాయని ఉదయం 11 గంటల వరకు జిల్లాలో 30.99 శాతం, మధ్యాహ్నం 1 గంటకు 49.57 శాతం, సాయంత్రం 3 గంటలకు 64.14 శాతం, సాయంత్రం 5 గంటలకు 74.78 శాతం ఓటింగ్ నమోదైనట్లుగా తెలిపారు.


