గొడిచర్ల, నక్కపల్లిలో బాహాబాహీ... | - | Sakshi
Sakshi News home page

గొడిచర్ల, నక్కపల్లిలో బాహాబాహీ...

Nov 6 2026 1:44 AM | Updated on Nov 6 2026 1:44 AM

● టీడీపీ, వైఎస్సార్‌సీపీ వర్గాల నడుమ వాగ్వాదం, ఘర్షణ ● పోలీసుల లాఠీచార్జ్‌

నక్కపల్లి : స్థానిక ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా నక్కపల్లి మండలంలో గురువారం నక్కపల్లి, గొడిచర్ల గ్రామాల్లో టీడీపీ, వైఎస్సార్‌సీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. గొడిచర్లలో ఈ ఘర్షణ తీవ్రమై ఇరువర్గాలు ఒకరికొకరు బాహాబాహీకి దిగి కొట్టుకునే వరకు వెళ్లింది. ఇరువర్గాలు పోలింగ్‌బూత్‌లోకి దూసుకుపోవడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళ్లే వైఎస్సార్‌సీపీకి చెందిన కొంతమంది పోలింగ్‌ ముగిసే గంట ముందు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్తుండగా వారిని టీడీపీ వర్గీయులు అడ్డుకున్నారు. వీరిలో ఒకరిద్దరు ఒకసారి ఓటు వేశారని రెండోసారి వేయడానికి వస్తున్నారంటూ వాదనకు దిగారు. మేమంతా ఓటర్లకు స్లిప్పులు పంపిణీ చేస్తున్నామని తమవాళ్లు ఎక్కడెక్కడ ఉన్నా ఫోన్‌ చేసి సమయం ముగిసిపోతోంది.. అంటూ పిలిచి ఓటు వేయడానికి పంపిస్తున్నామని వైఎస్సార్‌సీపీ వర్గీయులు స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఇరువర్గాల మధ్య మాటా మటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. టీడీపీ వర్గీయులు దౌర్జన్యం చేస్తున్నారని పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ వర్గీయులు 112 నంబరుకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశారు. ఇరువర్గాలు బాహాబాహీకి తలపడి తోపులాటకు దిగడంతో అక్కడ బందోబస్తు కోసం వచ్చిన ఇద్దరు పోలీసు సిబ్బంది లాఠీచార్జి చేసి ఇరువర్గాలను చెదర గొట్టారు. సమస్యాత్మక గ్రామంలో ఇద్దరే పోలీసులను బందోబస్తు కోసం పంపించారని, టీడీపీ వర్గీయులు దౌర్జన్యం చేస్తుంటే పోలీసులు చూస్తుండిపోయారని వైఎస్సార్‌సీపీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. అలాగే నక్కపల్లిలో జెడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు మాటామాటా పెంచుకుని తోపులాట వరకు రావడంతో ఇరుపార్టీలకు చెందిన నాయకులు వారిని విడదీసి ఘర్షణ తీవ్రం కాకుండా చెదర గొట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement