ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు
జిల్లాలో 425 ఎంపీటీసీ స్థానాలకు బరిలో 979 మంది
మిగిలిన రెండు స్థానాలు ఏకగ్రీవం
24 జెడ్పీటీసీ స్థానాలకు బరిలో 80 మంది
జిల్లాలో 1530 పోలింగ్ కేంద్రాలు, 12,600 సిబ్బంది
381 అతి సమస్యాత్మక, 465 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల గుర్తింపు
సాక్షి, అనకాపల్లి/తుమ్మపాల : జిల్లాలో పరిషత్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అనకాపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత జెడ్పీకి నిర్వహిస్తున్న తొలి ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికలు జిల్లాలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ నెల 5వ తేదీ ఉదయం నుంచి 7 గంటలకు ప్రారంభం అయ్యే పోలింగ్‌కు సంబంధించి ముందస్తుగా ఏర్పాట్లు చేసిన ప్రాంతాలకు ఎన్నికల సామగ్రి చేరవేసే ప్రక్రియ బుధవారం ఉదయం నుంచి ప్రారంభం అయ్యింది. జిల్లాలోని అన్ని మండలాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు సిబ్బంది చేరుకొని ఎన్నికల సామగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించే పనిలో నిమగ్నం అయ్యారు.
మండల ప్రాదేశిక స్థానాల పోటీలో 559 మంది
పరిషత్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కలెక్టర్ విజయకృష్ణన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలివి. జిల్లా పరిధిలో ఉన్న 24 మండలాలకు జెడ్పీటీసీ స్థానాల తరపున 80 మంది పోటీ పడుతున్నారు. జిల్లాలో 427 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, ఇప్పటికే రెండు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 425 ఎంపీటీసీ స్థానాలకు 979 మంది పోటీలో నిలిచారు. జెడ్పీటీసీ ఎన్నికలకు గానూ 1530 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 381 పోలింగ్ కేంద్రాలను అతి సమస్యాతక కేంద్రాలుగా, 461 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు గానూ 2,255 మంది సిబ్బందిని నియమించగా, ఎంపీటీసీ ఎన్నికలకు 10,345 మందిని కేటాయించారు. అన్ని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రి తరలించిన మేరకు పోలింగ్ అనంతరం ఆయా బ్యాలెట్ బాక్సుల్ని భద్రపరిచేందుకు 7 ప్రాంతాల్లో 10 కేంద్రాలను ఏర్పాటు చేశారు. రిసెప్సన్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను పర్యవేక్షించేందుకు సిబ్బందిని నియమించారు. 7వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలుకానుంది.
వర్షంతో సిబ్బందికి ఇక్కట్లు...
తుపాను ప్రభావంతో జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద సిబ్బంది ఇబ్బందులకు గురయ్యారు. కాగా పరిషత్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. అనకాపల్లి మండల పరిషత్ కార్యాలయంలోని ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని బుధవారం ఆమె పరిశీలించారు. ఎన్నికలకు సంబంధించిన ఫారాల నమోదులో తప్పులు, దిద్దుబాట్లు లేకుండా ఒకటికి రెండుసార్లు పరిశీలించాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు, ఎన్నికల సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక సదుపాయాలు, వసతి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
పోలింగ్ కేంద్రాలలో 100 శాతం వెబ్‌కాస్టింగ్
పోలింగ్ కేంద్రాల్లో 100 శాతం వెబ్‌కాస్టింగ్, వీడియోగ్రఫీ ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తెలిపారు. బ్యాలెట్ పేపర్లను స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరచడానికి తగిన ఏర్పాట్లు పూర్తి చేశామని స్పష్టం చేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి రిసెప్షన్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్ సెంటర్, కౌంటింగ్ సెంటర్‌లను ఆయా మండలాల వారీగా ఏర్పాటు చేశామన్నారు. అనకాపల్లి, బుచ్చెయ్యపేట, కశింకోట, మునగపాక, పరవాడ, సబ్బవరం మండలాలకు సంబంధించి ఏఎంఏఎల్. కాలేజ్, అనకాపల్లిలోను, చోడవరం మండలానికి సంబంధించి చోడవరం జెడ్పీ హైస్కూల్, దేవరపల్లి, కోటపాడు మండలాలకు సంబంధించి దేవరాపల్లి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులం (బాయ్స్), తెనుగుపూడి, నక్కపల్లి మండలానికి సంబంధించి ప్రభుత్వ జూనియర్ కాలేజ్, పాయకరావుపేట, ఎస్ రాయవరం మండలాలకు సంబంధించి జిల్లా పరిషత్ హైస్కూల్, నక్కపల్లిలోను, మాకవరపాలెం, నర్సీపట్నం, రోలుగుంట మండలాలకు సంబంధించి డాన్ బాస్కో డిగ్రీ కళాశాల, పెద్ద బొడ్డేపల్లి, నర్సీపట్నంలో ఏర్పాట్లు చేశారు. అలాగే కోటవురట్ల, గొలుగొండ, నాతవరం, రావికమతం మండలాలకు సంబంధించి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ నర్సీపట్నంలోనూ, వి.మాడుగుల, చీడికాడ మండలాలకు సంబంధించి సెయింట్ ఆన్స్ ఇంగ్లిష్ మీడియం స్కూల్, వి.మాడుగులలోనూ, అచ్యుతాపురం, రాంబిల్లి మండలాలకు సంబంధించి ఇండోర్ స్టేడియం యలమంచిలిలోను, యలమంచిలి మండలానికి సంబంధించి, ఎస్‌జీఏ ప్రభుత్వ డిగ్రీ కళాశాల యలమంచిలిలోను, ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.


