రాంబిల్లి : మండల పరిషత్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన శిబిరం వద్ద బుధవారం మధ్యాహ్నం భోజనం 3 గంటల వరకు రాకపోవడంతో ఆకలి కేకలతో సిబ్బంది మండల పరిషత్ అధికారులపై నిరసన వ్యక్తం చేశారు. కనీసం తాగునీరు కూడా సక్రమంగా ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుగర్ వ్యాధితో బాధిపడే సిబ్బంది మరిన్ని ఇబ్బందులు పడ్డారు. 3 గంటలకు భోజనం వద్దని భోజనం ఖర్చులు ఇవ్వాలని కొంత మంది డిమాండ్ చేశారు. మండలంలో వివిధ గ్రామాల్లో 51 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సిబ్బందికి అవసరమైన ఎన్నికల సామగ్రి పంపిణీ, సిబ్బంది, సామగ్రి తరలింపు కార్యక్రమాల కోసం రాంబిల్లిలో శిబిరాలను ఏర్పాటు చేశారు. సమయానికి భోజనం ఏర్పాట్లు చేయకపోవడంతో వారంతా ఇబ్బంది పడ్డారు.
ఎన్నికల సిబ్బందికి భోజన వసతిపై
నిర్లక్ష్యం... కలెక్టర్ ఆగ్రహం
మునగపాక : స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బుధవారం మునగపాక రాహుల్ గాంధీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన భోజన వసతిలో అధికారుల నిర్లక్ష్యంపై జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకు భోజన సదుపాయంతో పాటు తాగునీటి సదుపాయం కల్పించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని ఆమె తప్పుపట్టారు. ఎన్నికల రిసెప్షన్ సెంటర్‌ను పరిశీలించేందుకు వచ్చిన ఆమె భోజన వసతులపై ఆరా తీశారు. సకాలంలో భోజనం అందించలేదని ఉద్యోగులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనికి తోడు ఉద్యోగులకు సరిపడా భోజనం అలాగే తాగునీటి సౌకర్యాలు సరిగా లేకపోవడాన్ని గుర్తించిన ఆమె సంబంధిత ఎంపీడీవోపై కోపోద్రిక్తులయ్యారు. ఎన్నికల విధులు నిర్వహించే వారి పట్ల బాధ్యతగా వ్యవహరించాల్సింది పోయి నిర్లక్ష్యంగా ఉండడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎన్నికల రిటర్నింగ్ అఽధికారి రాజశేఖరన్,తహసీల్దార్ సంధ్య తదితరులున్నారు.


