పవన్‌కు ఒక న్యాయం.. రావణ్‌కు మరో న్యాయమా? | - | Sakshi
Sakshi News home page

పవన్‌కు ఒక న్యాయం.. రావణ్‌కు మరో న్యాయమా?

Jul 5 2026 3:06 AM | Updated on Jul 5 2026 3:06 AM

‘ప్రశ్న’ రావణ్‌ కేసులో కూటమి ప్రభుత్వం కక్షసాధింపు?

వరుస అరెస్టులతో ‘రెడ్‌ బుక్‌’ రాజ్యాంగం అమలు!

బెయిల్‌ వచ్చిన వెంటనే మరో పాత కేసు తెరపైకి..

పోలీస్‌ స్టేషన్ల వద్ద జనసేన కార్యకర్తలు హైడ్రామా..

ప్రేక్షక పాత్రలో పోలీసులు!

ప్రభుత్వానికి, పోలీసులకు న్యాయస్థానాల తీర్పులు చెంపపెట్టు

సాక్షి, అనకాపల్లి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టం అమలు తీరు, పోలీసుల వ్యవహారశైలిపై ప్రజల్లో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతుండడంతో పాటు చర్చలు జరు గుతున్నాయి. రాష్ట్రంలో డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ రాజ్యాంగం అమలు అవుతోందా.. లేక పాలకుల ‘రెడ్‌ బుక్‌’ రాజ్యాంగం నడుస్తోందా..? అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యూట్యూబర్‌ ‘ప్రశ్న’ రావణ్‌ కుమార్‌ అలియాస్‌ జోసెఫ్‌ అరెస్టు వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఒక కేసులో కోర్టు బెయిల్‌ మంజూరు చేసిన వెంటనే, పోలీసులు మరో పాత కేసునో లేక అధికార పక్ష కార్యకర్తలతో కొత్తగా ఇప్పించిన ఫిర్యాదునో తెరపైకి తెచ్చి వరుసగా అరెస్టులు చేయడం గమనార్హం. ఒకే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో కేసులు బనాయించి, వేధింపులకు గురిచేయడం వెనుక రాజకీయ కక్షసాధింపు స్పష్టంగా కనిపిస్తోందని ప్రభుత్వంపై తీవ్రస్థాయి లో మండిపడుతున్నారు.

నాడు పవన్‌ మాట్లాడితే న్యాయం..

నేడు రావణ్‌ మాట్లాడితే నేరమా?

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 151 మంది ఎమ్మెల్యేలను ఉద్దేశించి అప్పట్లో జనసేన అధినేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చేసిన కొన్ని అనుచిత వ్యాఖ్యలను, ఇటీవల జరిగిన ఒక దళిత క్రైస్తవ సభలో ప్రశ్న రావణ్‌ కేవలం గుర్తు చేశారు. నాడు అలాంటి వ్యాఖ్యలు చేసిన పవన్‌ కల్యాణ్‌ మాట్లాడిన మాటలను నేడు రావణ్‌ కుమార్‌ ప్రస్తావిస్తే.. అక్రమ కేసులు బనాయించి వేధించడం ఎంతవరకు సమంజసమని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌కు ఒక న్యాయం, రావణ్‌కు మరో న్యాయమా అంటూ నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా నిలదీస్తున్నారు.

పోలీసు స్టేషన్ల వద్ద జనసేన నాయకుల హైడ్రామా

పవన్‌ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో రావణ్‌ కుమార్‌ను హైదరాబాద్‌లో అరెస్టు చేసిన ఏపీ పోలీసులు మొదట పిఠాపురం తరలించారు. అక్కడ కోర్టు బెయిల్‌ ఇవ్వడంతో కాకినాడ పోలీసులు, ఆ తర్వాత మచిలీపట్నంలోని ఇనుగుదురు పోలీసులు, తాజాగా పాయకరావుపేట పోలీసులు వరుసగా ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రతి కోర్టు రావణ్‌కు బెయిల్‌ మంజూరు చేస్తున్నప్పటికీ పోలీసులు మాత్రం వదలడం లేదు.

ఈ క్రమంలో నక్కపల్లి సర్కిల్‌ పోలీసు స్టేషన్‌ వద్దకు జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుని తీవ్ర ఉద్రిక్తత సృష్టించారు. రావణ్‌పై కోడిగుడ్లు, టమాటాలు, చెప్పులతో దాడికి యత్నించడమే కాకుండా, స్టేషన్‌ ముందు రోడ్డుపై బైఠాయించి వంటావార్పు చేస్తూ గంటల తరబడి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న అధికార పక్ష శ్రేణులను అదుపు చేయడంలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారనే విమర్శలు వస్తున్నాయి. ఇంత ఉద్రిక్తత నడుమ డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో పోలీసులు హైడ్రామాకు తెరలేపారు.

కోర్టు తీర్పులు.. కూటమి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ!

హైదరాబాద్‌లో పిఠాపురం పోలీసులు ప్రశ్న రావణ్‌ను అరెస్ట్‌ చేసినప్పటి నుంచి.. పిఠాపురం, కాకినాడ, మచిలీపట్నం, యలమంచిలి న్యాయస్థానాలు రావణ్‌ రిమాండ్‌ను తిరస్కరిస్తూ వరుసగా బెయిల్‌ మంజూరు చేశాయి. న్యాయస్థానాల తీర్పులు కూటమి ప్రభుత్వానికి, పోలీసులకు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు చెంపపెట్టు లాంటివేనని రాజకీయ విశ్లేషకులు, ప్రజలు, మేధావులు సైతం చర్చించుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం, పోలీసుల వేధింపులు, అక్రమ కేసులతో ‘రెడ్‌ బుక్‌’ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంటే.. ‘న్యాయం ఇంకా బతికే ఉంది’ అని కోర్టులు తమ తీర్పుల ద్వారా నిరూపిస్తున్నాయి. ఈ కోర్టు తీర్పులతోనైనా ప్రభుత్వం, పోలీసుల తీరులో మార్పు రావాలని ప్రజలు స్పష్టం చేస్తున్నారు.

పోలీసుల ద్వారానే సమాచారం..?

ప్రశ్న రావణ్‌ను అరెస్ట్‌ చేసి ఎక్కడికి తీసుకెళ్తున్నారనే సమాచారాన్నంతా ముందస్తుగా జనసేన నాయకులకు పోలీసులే చేరవేస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జన సేన నాయకులు, కార్యకర్తలు బహిరంగంగా దాడులకు తెగబడుతున్నా వారిపై కేసులు నమోదు కావడం లేదు, సరికదా, కనీసం అరెస్టు చేయడం లేదు. పైగా వారితో పోలీసు అధికారులు నవ్వుతూ మాట్లాడుతున్న పరిస్థితులు పోలీసు స్టేషన్ల వద్ద నెలకొన్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement