చేపా..చేపా చిక్కవా? | - | Sakshi
Sakshi News home page

చేపా..చేపా చిక్కవా?

Jul 5 2026 3:06 AM | Updated on Jul 5 2026 3:06 AM

● ప్రతికూల వాతావరణంతో ఇబ్బందులు ● తాండవ జలాశయంలోవేట సాగక జాలర్ల అవస్థలు

చేపలవేటలో మత్స్యకారులకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. వాతావరణం అనుకూలంగా లేకపోవడం...15 రోజుల నుంచి వర్షాలు కురుస్తుండడంతో తాండవ జలాశయంలో వేట సాగడం లేదు. మత్స్యసంపద చిక్కకపోవడంతో చాలామంది జాలర్లు ఇబ్బందులకు గురవుతున్నారు.

గొలుగొండ: తాండవ జలాశయం మత్స్య సంపదకు పెట్టింది పేరు. పరీవాహక ప్రాంతంలోని సుమారు 16 గ్రామాల ప్రజలు ఈ జలాశయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. జలాశయంలో వేట సాగించి వచ్చిన చేపలు అమ్ముకుంటే తప్ప పూట గడవని పరిస్థితి. కొండంత ఆశతో వేటకు వెళ్లిన మత్స్యకారులకు నిరాశే మిగులుతోంది. ఒకవైపు ప్రకృతి కనికరించకపోవడం, మరో వైపు మత్స్యశాఖ పట్టించుకోకపోవడంతో జలాశయంపై రపడి జీవనంసాగిస్తున్న 400 మంది జాలర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

గొలుగొండ, నాతవరం మండలాలకు ఆనుకుని ఉన్న తాండవ జలాశయం మత్స్య సంపదకు పుట్టినిళ్లు. ఇక్కడ దొరికే రొయ్యలు, చేపలకు మంచి డిమాండ్‌ ఉంది. మే నెలలో రొయ్యల సీజన్‌ ప్రారంభమవుతుంది. ఈ ఏడాది జలాశయం నీటి మట్టం పూర్తి స్థాయిలో ఉండడం వల్ల రొయ్యల వేటకు అనుకూలంగా లేదు. సాధారణంగా జూన్‌ రెండవ వారం నుంచి చేపల వేటకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఈ ఏడాది రొయ్యల వేట సాగకపోయినా చేపలు పట్టి అయినా కుటుంబాన్ని పోషించుకుందామనుకున్న వారికి మళ్లీ నిరాశే ఎదురైంది. తాండవ జలాశయంలో మత్స్యశాఖ అధికారులు తగినన్ని చేప పిల్లలు వేయకపోవడంతో వలలకు చేపలు చిక్కడం లేదని జాలర్లు తెలిపారు.

తాండవ జలాశయం సుమారు నాలుగువేల ఎకరాల్లో విస్తరించి ఉంది. గొలుగొండ, నాతవరం మండలాల్లో ఉన్న సాలికమల్లవరం, వెంకటాపురం, జోగుంపేట, పొగచెట్లపాలెం, గొలుగొండ, అమ్మపేట, కొత్తమల్లంపేట, విప్పలపాలెం, గాదంపాలెం, జాలారు పేట తదితర గ్రామాల్లో ఉన్న జాలర్లు జలాశయంలో వేట సాగిస్తారు. వీరితో పాటు అల్లూరి జిల్లా రాంనగరం అనే గిరిజన గ్రామ ప్రజలు చేపలు పడతారు. ఈ ఏడాది రొయ్యల వేటతో పాటు చేపల వేటకు వాతావరణం అనుకూలించలేదని జాలర్లు వాపోయారు.

గాలులతో ఆటంకం

చేపల వేట సాగాలంటే జలాశయం ప్రశాంతంగా ఉండాలి. అయితే ప్రస్తుతం తీవ్రంగా వీస్తున్న గాలులతో వేటకు ఆటంకం ఏర్పడుతోంది. గాలులు తీవ్రంగా వీస్తే చేపలు చిక్కే పరిస్థితి ఉండదు. గాలుల కారణంగా వలలు నాశనమవడంతో పాటు బోట్లు బోల్తాపడే ప్రమాదం ఉంది. ప్రస్తుతం గాలుల తీవ్రత అధికంగా ఉండడంతో చాలా మంది జాలర్లు వేటకు వెళ్లడం లేదు. దీంతో పూట గడవడం కష్టంగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురుస్తున్నందున గెడ్డల నుంచి ఎర్ర నీరు ప్రవహించే సమయంలో పెద్దబొచ్చులు, ఇతర రకాలైన చేపలు వలలకు అధికంగా చిక్కుతాయి. కానీ ప్రస్తుత పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందని వారు తెలిపారు. సీజన్‌లో రోజుకు రూ.నాలుగు లక్షల వరకూ ‘తాండవ’ మత్స్యకారులకు ఆదాయం లభిస్తుంది. ఇప్పుడు కనీస స్థాయిలో కూడా ఆదాయం లేదని వాపోతున్నారు.

మత్స్యశాఖ నిర్లక్ష్యం

ఉమ్మడి విశాఖ జిల్లాలోనే తాండవ అతిపెద్ద జలాశయం. జలాశయంలో ప్రతీ ఏటా 15 లక్షల చేప పిల్లలు విడుదల చేస్తేనే అవి పెరిగి జాలర్లకు మత్స్య సంపద చిక్కుతుంది. అయితే ఏటా తూతూ మంత్రంగానే విడుదల చేసి మత్స్యశాఖ అధికారులు చేతులు దులుపుకొంటున్నారు. ఎన్ని పిల్లలను జలాశయంలో వేశారో ఎవరికీ తెలియడం లేదని, ప్రతీ ఏటా ఇలాగే జరగడం వల్ల చేపలు దొరకడంలేదని మత్స్యకారులు చెప్పారు.

పక్షం రోజులుగా అధికంగా గాలులు

15 రోజుల నుంచి తాండవ జలాశయంలో గాలులు తీవ్రంగా వీస్తున్నాయి. దీంతో వలలు నాశనమవడంతో పాటు, బోట్లు తిరగబడుతున్నాయి. చేపల వేటపై ఆధారపడి జీవనం సాగించే జాలర్లకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రొయ్యల సీజన్‌తో పాటు, చేపల సీజన్‌లో కూడా నిరాశే మిగులుతోంది. వర్షాలు కురిసి, గెడ్డలు పొంగినప్పుడు చాలా ఎక్కువగా చేపలు చిక్కేవి. ఇప్పుడా పరిస్థితి లేదు.

–జొన్నా అప్పన్న, ఎస్‌. మల్లవరం

రూ.వంద కూడా రావడం లేదు

ధైర్యం చేసి వేటకు వెళ్లినా ప్రయోజనం కనిపించడంలేదు. రోజుకు కనీసం వంద రూపాయలైనా రావడం లేదు. చేపలు లేకపోవడం, వాతావరణం అనుకూలించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 16 గ్రామాల్లో 400 మందికి ఈ జలాశయమే ఆధారం.

– దేముడు, జాలరు, వెంకటాపురం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement