వైఎస్సార్‌సీపీ నేతపై ఎస్‌ఐ దాష్టీకం దారుణం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నేతపై ఎస్‌ఐ దాష్టీకం దారుణం

Jul 5 2026 3:06 AM | Updated on Jul 5 2026 3:06 AM

నర్సీపట్నం: వైఎస్సార్‌సీపీ నాయకుడైన సుర్ల నూకరాజును చిత్రహింసలకు గురి చేసి, గాయపరిచిన నర్సీపట్నం రూరల్‌ ఎస్‌ఐ రాజారావుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ డిమాండ్‌ చేశారు. గాయాలతో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో చేరిన నూకరాజును ఆయన శనివారం పరామర్శించి, ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఈ నెల 3న అధికారులు చేపట్టిన పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమం వద్దకు పాస్‌ పుస్తకం తీసుకునేందుకు తన తల్లిని వెంటబెట్టుకుని వెళ్లిన నూకరాజు గతంలో మాజీ సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఇవే పాస్‌పుస్తకాలు పంపిణీ చేస్తే తప్పు అని అవే పాస్‌పుస్తకాలను ఎలా పంపిణీ చేస్తున్నారని ప్రశ్నించారని చెప్పారు. దీనికి ఆగ్రహించిన టీడీపీ నేతలు నూకరాజు తల్లి పాసుపుస్తకం తగలేశారని వివరించారు. టీడీపీ నాయకులు, అధికారుల ఒత్తిడి మేరకు ఎస్‌ఐ రాజారావు నూకరాజుపై అతిగా వ్యవహరించారని విమర్శించారు.

విచక్షణ రహితంగా తన్ని..

అంతటితో ఆగకుండా ఆ తర్వాత ఎలాంటి ఫిర్యాదు లేనప్పటికీ ఎస్‌ఐ ఆదేశాలతో కానిస్టేబుళ్లు త్రిమూర్తులు, కొండబాబు అప్పన్నపాలెం వెళ్లి నూకరాజును పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చి కర్రకు జెండూబాం రాసి విచక్షణారహితంగా కొట్టారని, ఎస్‌ఐ బూటు కాలితో నూకరాజు మర్మాంగాలపై తన్నారని ధ్వజమెత్తారు. ఎస్‌ఐ బలవంతంగా లాకప్‌లోకి నెట్టడంతో గేటు తగిలి బాధితుడు కాలుకు గాయమైందని వివరించారు. వీడియో కాల్‌లో టీడీపీ నాయకులకు చూపిస్తూ నూకరాజును అతి దారుణంగా చిత్రహింసలకు గురి చేశారని గణేశ్‌ ధ్వజమెత్తారు. కొట్టిన విషయాన్ని బయటకు చెప్పితే కేసు పెట్టి లోపలేస్తామని ఎస్‌ఐ బాధితుడిని బెదిరించారని చెప్పారు. తనకు తాను తన్నుకోవటం వల్ల కాలికి దెబ్బ తగిలిందని బాధితుడితో బలవంతంగా చెప్పించి ఎస్‌ఐ వీడియో తీశారన్నారు. బాధితుడిని జైలులో వేయాలనే దురాలోచనతో రాత్రి 11గంటల సమయంలో ఆల్కహాలు టెస్ట్‌ చేయించి అతికిరాతకంగా వ్యవహారించారని గణేశ్‌ పేర్కొన్నారు. ఎస్‌ఐ వ్యవహారశైలిని డీఎస్పీ, ఎస్పీ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. అధికారులు స్పందించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పేర్కొన్నారు.

మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement